
ధర్నాలు.. రాస్తారోకోలు
● యూరియా కోసం కొనసాగిన
అన్నదాతల ఆందోళనలు
● పలుచోట్ల రైతులకు మద్దతు తెలిపిన బీఆర్‌ఎస్ నాయకులు
అచ్చంపేట/ బిజినేపల్లి/ తిమ్మాజిపేట: జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. యూరియా కోసం ఏదోఒకచోట రైతులు రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు చేపట్టడం నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం అచ్చంపేటలోని లింగాల చౌరస్తాలో రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుడు పోకల మనోహర్ మాట్లాడుతూ ఎరువుల కోసం గోసపడిన ఎనుకటి రోజులు మళ్లీ ఈ ప్రభుత్వంలో వచ్చాయని, పంటలకు అవసరమైన యూరియా అందించాల్సిన సమయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నెల రోజుల నుంచి రాత్రనకా.. పగలనకా.. విక్రయ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని, వర్షాలు పడుతున్నా లెక్క చేయకుండా తడుస్తూ క్యూలో పడిగాపులు కాస్తూ రోజంతా లైన్లో ఉన్నా ఒక్క యూరియా బస్తా దొరకకపోవడంతో రైతులు నిరాశతో వెనుదిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పర్వతాలు, వంశీ, రవీందర్‌రావు, రమేష్‌రావు, శివ, కుత్బుద్దీన్, రహమత్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
● బిజినేపల్లిలోని పీఏసీఎస్ గోదాం, గ్రోమోర్ కేంద్రాల్లో యూరియా సరఫరా ఆలస్యంపై ఆగ్రహించిన రోడ్డుపై బైఠాయించి వాహనాలు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జిల్లా వ్యవసాయ అధికారులతో మాట్లాడి సమస్యను సద్దుమణిగేలా చేశారు. ఈ విషయమై ఏఓ కమల్‌కుమార్ వివరిస్తూ రైతులకు మంగళవారం టోకెన్లు ఇచ్చి బుధవారం యూరియా అందిస్తామని పేర్కొన్నారు.
● తిమ్మాజిపేటలోని ప్రధాన రహదారి సమీపంలో ఉన్న తెలంగాణ ఆగ్రో దుకాణం వద్ద యూరియా వచ్చిందన్న విషయం తెలుసుకున్న రైతులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో యూరియా తమకు దొరుకుతదా.. లేదా అనే ఆందోళనతో ఒక్కసారిగ టోకెన్ల కోసం ఎగబడ్డారు. దీంతో రైతులను అదుపు చేయలేక దుకాణదారు కొద్దిసేపు దుకాణం మూసివేశారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి అక్కడికి చేరుకుని అందరికీ యూరియా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం రైతులు వెనుదిరిగారు. రాస్తారోకో చేపట్టిన రైతులకు బీఆర్‌ఎస్ నాయకులు మద్దతు తెలిపారు.
బిజినేపల్లిలో రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులు
అచ్చంపేట అంబేడ్కర్ చౌరస్తాలో రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టిన బీఆర్‌ఎస్ నాయకులు

ధర్నాలు.. రాస్తారోకోలు

ధర్నాలు.. రాస్తారోకోలు