
మద్యం తాగి నిమజ్జనంలో పాల్గొనవద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: వినాయ చవితి నిమజ్జనంలో మద్యం తాగి పాల్గొనకూడదని, భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో ఇతరులకు ఇబ్బందులు కలగకుండా నిర్వహించుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు చెరువులో వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను నాగనూల్ చెరువులో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేశామని, భక్తులు పోలీసు శాఖకు సహకరించాలన్నారు. నాగనూలు చెరువు వద్ద నిమజ్జన సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుద్దీపాలతోపాటు రెండు క్రేన్లను, గత ఈతగాళ్లు, పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులన్నీ నిండాయని, నిమజ్జన సమయంలో మద్యం తాగి చెరువుల వద్దకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే తల్లిదండ్రులతోపాటు పిల్లలు కూడా నిమజ్జన ప్రదేశానికి వస్తే చెరువులో దిగకుండా జాగ్రత్తగా గమనించాలని చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే డయల్ 100, నాగర్‌కర్నూల్ పోలీస్ కంట్రోల్ రూం నం.87126 57709కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్, సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ గోవర్ధన్ తదితరులున్నారు.