
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
వెల్దండ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ్మ, జాతీయ మాజీ కమిషన్ సభ్యులు ఆచారి అన్నారు. మంగళవారం మండలంలోని కుప్పగండ్లలో ఆరు గ్యారంటీల అమలు కోసం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహారదీక్షకు వారు సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు.. 420 హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి 20 నెలలు గడిచినా నేటికీ నెరవేర్చడం లేదన్నారు. మహిళలకు రూ.2,500 భృతి, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, వృద్ధాప్య పింఛన్ పెంపు, ఇంట్లో ఇద్దరు వృద్ధులకు నూతన పింఛన్, రైతులకు రైతు భరోసా రూ.15 వేలు తదితర హామీల ఊసే లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో నిర్మించిన సీసీరోడ్లు, శ్మశాన వాటికలు ఇతర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని గుర్తుచేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ ప్రధాని వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శారదమ్మ, మాజీ ఉపసర్పంచ్ రమేష్, నాయకులు దుర్గాప్రసాద్, కృష్ణగౌడు, యాదగిరి, బాలస్వామి, సుబ్బయ్యగౌడు తదితరులు పాల్గొన్నారు.