
పన్నుల వసూళ్లపై నిర్లక్ష్యం తగదు
నాగర్‌కర్నూల్: మునిస్పాలిటీల్లో ఆస్తి పన్ను, నీటి బకాయిల వసూళ్లలో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, వన మహోత్సవం, వరదలు– నష్టాలు, సీజనల్ వ్యాధులు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రెవెన్యూ పన్ను వసూళ్లు, భవన నిర్మాణ అనుమతి, భూమి క్రమబద్ధీకరణ పథకం, సీసీ రోడ్లు– డ్రెయినేజీల నిర్మాణం, వీధిదీపాలు, జంతు జనన నియంత్రణ కేంద్రం, ఫిర్యాదులు తదితర అంశాలపై అదనపు కలెక్టర్ దేవసహాయంతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో వార్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా మున్సిపల్ కమిషనర్లు, పట్టణ అభివృద్ధి, ఇంజినీరింగ్ విభాగ సిబ్బంది తక్షణమే సమన్వయం చేసుకుని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆర్థిక వనరులను బలోపేతం చేసేందుకు ఆస్తి పన్ను, నీటి చార్జీల వసూళ్లు చేపట్టాలన్నారు. కొత్త గృహ నిర్మాణాలకు అవసరమైన నీటి కనెక్షన్లు సకాలంలో మంజూరు చేయాలన్నారు. ప్రణాళిక కింద చేపట్టిన అభివృద్ధి, శానిటేషన్ పనులు నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పాడుబడిన, శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే గుర్తించి అందులో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ కింద రుసుంలు చెల్లించిన పౌరులకు త్వరితగతిన ప్రొసీడింగ్స్ అందించాలన్నారు.
భూ భారతి దరఖాస్తుల
పెండింగ్‌పై అసహనం
లింగాల: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. లింగాల తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి.. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విస్మయం వ్యక్తం చేశారు. మండలంలో మొత్తం 652 దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 82 మాత్రమే పరిష్కరించడంపై అసహనం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచడంపై తహసీల్దార్‌ను ప్రశ్నించారు. భూ భారతి కొత్త ఆర్‌ఓఆర్–2025 చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణాన్ని పరిశీలించారు. లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ నిబంధనల మేరకు ఇంటిని నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ పాండునాయక్, డీటీ కృష్ణాజీ, రెవెన్యూ, వైద్య సిబ్బంది ఉన్నారు.