
మొక్కజొన్న రైతులకు అండగా ఎస్పీ
నాగర్‌కర్నూల్ క్రైం: మొక్క జొన్న కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు ఇవ్వకపోవడంతో బాధిత రైతులు ఎస్పీగైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌ను ఆశ్రయించడంతో ఆయన బాధితులకు న్యాయం చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం ఎస్పీ వెల్లడించిన వివరాలు.. బిజినేపల్లి మండలంలోని ఖానాపూర్‌కు చెందిన ఆంజనేయులు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని నందివడ్డెమాన్, ఖానాపూర్, నల్లవెల్లి గ్రామాలకు చెందిన దాదాపుగా 56మంది రైతులకు సంబంధించి రూ.కోటి విలువైన మొక్కజొన్నను కొనుగోలు చేశాడు. ఆంజనేయులు రైతులకు డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధిత రైతులందరూ కలిసి రెండు నెలల క్రితం న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించారు. స్పందించిన ఎస్పీ రైతులకు న్యాయం చేయాలని పోలీసు సిబ్బందికి ఆదేశించడంతో ఆంజనేయులు నుంచి రూ.60లక్షల వరకు వసూలు చేసి బుధవారం రైతులకు అందజేశారు. రైతులకు న్యాయం చేసిన ఎస్పీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. గుర్తింపు లేని వ్యక్తులకు రైతులు తమ పంటలను విక్రయించొద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మకాలు చేయాలని సూచించారు.