
వైద్యం.. దైన్యం!
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకోవాలంటే రూ.వేలల్లో ఖర్చవుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమకు సమీపంలోని పీహెచ్‌సీ లేదా సీహెచ్‌సీల్లో ప్రతినెలా పరీక్షలు చేయించుకోవడంతో పాటు వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. అయితే గర్భిణులు పురిటినొప్పులతో సమీపంలోని పీహెచ్‌సీ లేదా పీహెచ్‌సీకి వెళ్తే హైరిస్క్ పేరుతో జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. ఫలితంగా జిల్లా ఆస్పత్రి వైద్యులపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటైన తర్వాత జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్చారు. అయితే అందుకు అనుగుణంగా సదుపాయాలు మాత్రం కల్పించలేదు. వైద్యుల కొరత, మౌలిక సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఆస్పత్రిలో గర్భిణులను పరీక్షించడం.. కాన్పులు చేయడం ఇబ్బందికరంగా మారింది.
ఆరు నెలల్లో 2,289 కాన్పులు..
జిల్లా జనరల్ ఆస్పత్రిలో రోజు 160 మందికి పైగా గర్భిణులు వైద్యసేవలు పొందడంతో పాటు 20 మంది వరకు సాధారణ, సిజేరియన్ కాన్పులు అవుతున్నాయి. ఆరునెలల కాలంలో సాధారణ, సిజేరియన్ డెలివరీలు 2,289 జరిగాయి. అయితే పీహెచ్‌సీల్లోనూ ప్రసవాలు చేయాల్సి ఉండగా.. ఎక్కువ శాతం హైరిస్క్ పేరుతో గర్భిణులను జిల్లా జనరల్ ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. దీంతో ఇక్కడి వైద్యులపై పనిభారం పెరిగి ఒత్తిడికి లోనవుతున్నారు.
ఒకే ఆపరేషన్ థియేటర్..
ప్రసవాల కోసం వచ్చే గర్భిణుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు కల్పించకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా మేజర్ ఆపరేషన్ థియేటర్, మైనర్ ఆపరేషన్ థియేటర్, సెప్టిక్ ఆపరేషన్ థియేటర్ ఉండాల్సి ఉండగా.. కేవలం లేబర్‌రూం, సెఫ్టిక్ ఆపరేషన్ ఽఽథియేటర్ మాత్రమే కొనసాగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే ఆపరేషన్ థియేటర్ ఉండటం.. నిత్యం అధిక సంఖ్యలో ఆపరేషన్లు చేయాల్సి వస్తుండటంతో గర్భిణులకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం నెలకొందని పలువురు ఆందోళన చెందుతున్నారు.
వేధిస్తోన్న వైద్యుల కొరత..
అనారోగ్య సమస్యలు ఉన్నవారితో పాటు హైరిస్క్ కేసులు జనరల్ ఆస్పత్రి వస్తున్నాయి. వైద్యసేవల్లో ఏదేని అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఆస్పత్రి వైద్యులపై విమర్శలు, ఆరోపణలు వస్తుండటంతో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా గైనకాలజీ విభాగంలో సరిపడా వైద్యులను కేటాయించక పోవడంతో ఉన్నవారిపైనే భారం పడుతోంది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, 15మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరం ఉండగా.. కేవలం ఇద్దరు రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే గర్భిణులకు సేవలు అందిస్తున్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతో పాటు మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
హైరిస్క్ పేరుతో జిల్లా జనరల్ ఆస్పత్రికి గర్భిణుల రెఫర్
గైనకాలజీ విభాగంలో
సరిపడా వైద్యులు లేక అవస్థలు
మౌలిక సదుపాయాలు సైతం కరువు
ప్రతినెలా 400 పైగా కాన్పులు

వైద్యం.. దైన్యం!

వైద్యం.. దైన్యం!