
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
నాగర్‌కర్నూల్: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస ఫర్టిలైజర్ దుకాణంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా దుకాణంలోని విత్తనాలు, ఎరువుల స్టాక్‌తో పాటు రైతులకు విక్రయిస్తున్న తీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నాసిరకం విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేస్తే సహించమన్నారు. ప్రతి ఫర్టిలైజర్ దుకాణంలో విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల నిల్వలు వివరాలు, నాణ్యతా ప్రమాణాలు, ధరల పట్టికలను ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా రికార్డుల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. తప్పనిసరిగా ఈ–పాస్ ద్వారానే విక్రయించాలని.. అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. మండల, గ్రామ స్థాయిల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమిటీలు నిరంతరం నిఘా ఉంచినట్లు తెలిపారు. రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే స్థానిక వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఆయన వెంట డీఏఓ చంద్రశేఖర్ ఉన్నారు.