
‘సహకారం’లో మార్పు!
నాగర్‌కర్నూల్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందించే సేవలను మరింత విస్తృతం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం రైతులకు ఎరువులు, విత్తనాల పంపిణీ, రుణాల మంజూరు వంటి వాటితో పాటు ధాన్యం కొనుగోళ్లు పీఏసీఎస్‌లకు పెద్దఎత్తున లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో సహకార సంఘాలను ఇతర వ్యాపార రంగాల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మార్పుచేసి.. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లాలో 16 సంఘాల ఎంపిక..
జిల్లాలో మొత్తం 23 పీఏసీఎస్‌లు ఉండగా.. దాదాపు 2.30లక్షల మంది సభ్యులు ఉన్నారు. అయితే మొదటి విడతలో 16 సంఘాలు రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా మారనున్నాయి. అందులో నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, తాడూర్, తెలకపల్లి, కొల్లాపూర్, పెంట్లవెల్లి, నర్సాయపల్లి, కొండనాగుల, అంబట్‌పల్లి, అమ్రాబాద్, ఉప్పునుంతల, అచ్చంపేట, రంగాపూర్, చారకొండ, కల్వకుర్తి పీఏసీఎస్‌లు ఉన్నాయి. కాగా, సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వేర్వేరు లక్ష్యాలతో ఉన్నప్పటికీ.. ఇవి రెండూ ఒకే రకమైన సంస్థలు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ప్రధానంగా రైతుల ఆదాయం, ఉత్పత్తులు పెంచడం, ప్రాసెసింగ్ వంటి వాటిపై దృష్టి సారించాల్సి ఉంటుంది. రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. అదే విధంగా వ్యవసాయ పనిముట్లు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచడంతో పాటు పంట ఉత్పత్తులకు అధికంగా లాభాలు వచ్చేలా మార్కెటింగ్ చేయడం, విత్తనోత్పత్తి వంటి కార్యక్రమాలు చేపట్టనున్నాయి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను జూన్ 5వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. సాంకేతికతను అందిపుచ్చుకొని ఎలాంటి వ్యాపారాలు నిర్వహించాలి.. వాటి నిర్వహణ ఎలా అనే విషయాలపై శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, శిక్షణకు సంబంధించి కేవలం సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమేనా.. లేక పాలకవర్గాలకు కూడా శిక్షణ ఇస్తారా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, సహకార శాఖకు నిర్వహణ బాధ్యత ఎంత వరకు సాధ్యమవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రైతులకు అన్నివిధాలా మేలు..
జిల్లాలో 23 పీఏసీఎస్‌లు ఉండగా.. ప్రస్తుతం 16 సొసైటీలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా మారనున్నాయి. రైతులకు అన్నివిధాలా మేలు చేయడమే వీటి ఉద్దేశం. సిబ్బంది శిక్షణకు సంబంధించి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు. – రఘు, డీసీఓ
ఇకపై రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా పీఏసీఎస్‌లు
జిల్లాలో మొదటి విడత 16 సంఘాల ఎంపిక
రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా ముందుకు..