కందనూలు: ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లి మెంటరీ పరీక్షలు మంగళవారం ముగిశాయి. జిల్లావ్యాప్తంగా 20 పరీక్ష కేంద్రాల్లో చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించగా.. మొదటి సంవత్సరం విద్యార్థులు 2,350 మందికి గాను 2,186 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 2,179 మందికి గాను 2,036, ఒకేషనల్ విభాగంలో 171 మందికి గాను 1,50 మంది హాజరై పరీక్షలు రాశారు. అలాగే ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 656 మందికి గాను 600 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 606 మందికి గాను 556 మంది, ఒకేషనల్ విభాగంలో 50 మందికి గాను 44 మంది హాజరై పరీక్షలు రాశారు. మొదటి సంవత్సరంలో 164 మంది, ద్వితీయ సంవత్సరంలో 56 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో ప్రశాంతంగా పరీక్షలు ముగిసినట్లు డీఐఈఓ వెంకటరమణ తెలిపారు.
నల్లమలలోవిద్యాభివృద్ధికి కృషి
అచ్చంపేట: నల్లమలలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం అచ్చంపేటలో పదో తరగతి వార్షిక పరీక్షల్లో 500 పైగా మార్కులు సాఽధించిన 290 మంది విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రూ. 200కోట్లతో రాయిచోడు వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మి స్తున్నట్లు తెలిపారు. అప్ప శివ జ్యువెలర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జి.రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, మల్లేష్, గోపిశెట్టి శివ, గౌరీ శంకర్, ఎ.గోపాల్‌రెడ్డి, ఎం.రామనాథం, నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు.
పేదల పక్షాన నిరంతర పోరాటం
చారకొండ: పేదల పక్షాన సీపీఐ నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం చారకొండ, వంగూరు మండలాల సీపీఐ మూడో మహాసభలను మండల కార్యదర్శి అశోక్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, నియంతృత్వ పాలన సాగిస్తుందన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను మట్టుపెట్టేందుకు బూటకపు ఎన్‌కౌంటర్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి.. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు వార్ల వెంకటయ్య, చిల్వేరు శ్రీనివాసులు, నూనె వెంకటేశ్, గోపాల్, మల్లేష్, తిరుపతమ్మ, పరశురాం, శ్రీను, నారాయణరెడ్డి, జంగయ్య, ప్రసాద్ పాల్గొన్నారు.
పీయూలో 4వ స్నాతకోత్సవం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం వచ్చే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, 2022– 24 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ పూర్తిచేసిన విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని, ఫీజు దరఖాస్తు ఫారాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. టాపర్స్‌కు గోల్డ్ మెడల్, కన్వకేషన్ సర్టిఫికెట్లను అందిస్తామన్నారు. జూన్ 16 వరకు నేరుగా, 30 వరకు ఫైన్‌తో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.