
ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి
నాగర్‌కర్నూల్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి 14 మంది ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తారని వారికి న్యాయం చేసేలా చూడాలన్నారు. ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపినట్లు చెప్పారు.
ధాన్యం తూకాల్లో తేడా లేకుండా చూడాలి
కల్వకుర్తి టౌన్: వరి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించే ధాన్యం తూకాల్లో ఎ లాంటి తేడా లేకుండా చూడాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. సోమవారం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన జిల్లా సివిల్ సప్లయ్ డీఎం రాజేందర్‌తో కలిసి పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు వడ్లను తీసుకొచ్చేట ప్పుడు ఎండబెట్టి తీసుకొని రావాలని, తేమ శాతం ఎంత తక్కువగా ఉంటే అంత మంచి రేటు వస్తుందని సూచించారు. సన్నరకం ధా న్యానికి ప్రభుత్వం బోనస్ సకాలంలో అందుతుందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధా న్యాన్ని అమ్మాలని చెప్పారు. అనంతరం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని త్వరగా లారీ ల ద్వారా మిల్లులకు పంపాలని, దీంతో వర్షం పడితే ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లకుండా ఉంటుందని నిర్వాహకులను ఆదేశించారు.
పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కందనూలు: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ వెంకటరమణ అన్నారు. సోమవారం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐఈఓ మాట్లాడుతూ గురువారం నుంచి 29 వరకు నిర్వహించనున్న పరీక్షల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సంవత్సరం పరీక్షలు కొనసాగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 6,045 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా వీరికోసం 20 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు ఒక ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, ముగ్గురు కస్టోడియన్లను నియమించామన్నారు. అలాగే జూన్ 3 నుంచి 6 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయని చెప్పారు. సమావేశంలో ప్రిన్సిపాల్స్ ప్రభువర్ధన్‌రెడ్డి, మాధవి, సీనియర్ అధ్యాపకులు సైదులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని పలు పరీక్ష కేంద్రాల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. వీసీ శ్రీనివాస్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాల, వాసవీ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పరీక్ష కేంద్రంలోనికి విద్యార్థి వెళ్లే క్రమంలో తప్పకుండా హాల్‌టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డును పరిశీలించిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించాలని ఆదేశించారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని సూచించారు. సెమిస్టర్–4కు మొత్తం 8,142 మంది విద్యార్థులకు 7,859 మంది విద్యార్థులు హాజరై 283 గైర్హాజరయ్యారు. సెమిస్టర్–5కు సంబంధించి 467 మంది విద్యార్థులు 435 మంది హాజరై 32 మంది గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రవీణ ఒక ప్రకటనలో తెలిపారు.

ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి