
పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
కొల్లాపూర్ రూరల్: మారుమూల కొల్లాపూర్ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల్‌నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని మొలచింతపల్లిలో నిర్వహించిన సీపీఐ మండల పార్టీ మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కొల్లాపూర్ ప్రాంతంలోని నల్లమల అడవిలో ముడి సరుకులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో పాలకులు కృషి చేస్తే పేపర్, సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంతో అనువుగా ఉన్నా కానీ, పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతు భరోసా రైతులందరికీ ఇవ్వాలని కోరారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్రలో పదవుల కోసం కాకుండా పేద ప్రజలకు ఎంతో కృషి చేసిందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఫయాజ్, శివుడు తదితరులు పాల్గొన్నారు.