
పాలమూరు బాధ్యత నాదే
దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
నా సొంత గడ్డ అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నియోజకవర్గంలోని రైతులు గిరిజన, గిరిజనేతరులు అనే తేడా లేకుండా రైతులందరికీ ఉచితంగా సోలార్ పంప్‌సెట్లను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఎన్ని మోటార్లు అవసరమైనా ఉచితంగా అందిస్తాం. సోలార్ విద్యుత్ ద్వారా నెలనెలా రూ.6 వేల వరకు ఆదాయం పొందేలా చర్యలు చేపడతాం. రానున్న వంద రోజుల్లోనే అందరికీ సోలార్ విద్యుత్ అందించి దేశానికి మోడల్‌గా తీర్చిదిద్దుతాం. వ్యవసాయ, గృహ వినియోగానికి సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తూ అదనపు విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్ముకునేలా ఏర్పాట్లు చేస్తామని, ఇందుకోసం ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని డిప్యూటీ సీఎంకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేం కోరినట్లు వంశీకృష్ణను గెలిపించి మీ మాట నిలుబెట్టుకున్నారు.. ఇప్పుడు నా బాధ్యతగా అచ్చంపేట అభివృద్ధికి కావాల్సిన ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తే నిధులు మంజూరు చేస్తామని సీఎం ప్రకటించారు. స్వంత నియోజకవర్గం నల్లమలలో సాగునీరు, విద్య, ఉపాధి, రోడ్లు, ఇతర అవసరాలను తీర్చడంలో ఎమ్మెల్యేకు ఎంత బాధ్యత ఉందో నాకు అంతే ఉందని సీఎం అన్నారు.
● ప్రత్యేక ప్రణాళికతో సంక్షేమ పథకాలకు నిధులు
● ఈ ప్రాంత బిడ్డగా నా బాధ్యత మరింత పెరిగింది
● విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాం
● స్వగ్రామం కొండారెడ్డిపల్లిలోనూ పర్యటన.. ఘన స్వాగతం పలికిన ప్రజలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ సాక్షి, నాగర్‌కర్నూల్/ అచ్చంపేట: ‘ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి నాదే బాధ్యత. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలను గెలిపించి.. నాపై విశ్వాసాన్ని చూపి ఆశీర్వదించారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడే అవకాశం దక్కింది. నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి, నిధులు విడుదల చేస్తా. విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాను’ అని సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవా రం అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. మాచారంలోని చెంచు రైతుల పోడు భూముల్లోకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ పంప్‌సెట్, ప్లాంటేషన్, స్ప్రింక్లర్లు, డ్రిప్ వ్యవస్థలను పరిశీలించారు. గ్రామంలోని సీతారామాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడారు. ‘పాలమూరు బిడ్డలు అంటేనే తట్ట, పార పని.. ముంబయి, పుణె వలస వెళ్లి కష్టపడేవాళ్లని అందరికీ తెలుసు. దేశంలో ఎక్కడ ప్రాజెక్టులు కట్టాలన్నా పాలమూరు బిడ్డలే కావాలి. దేశం నలుమూలలా భూములను సస్యశ్యామ లం చేసేందుకు మన బిడ్డలు రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడుతున్నారు. నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేందుకు గర్వపడుతున్నా. ఎవరైనా నేను పాలమూరుకు చెందిన వాడినని చెప్పినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది’ అని పేర్కొన్నారు.
సభావేదిక వద్దకు నడిచి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఇందిర సౌర జల వికాసం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి

పాలమూరు బాధ్యత నాదే