
లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలి
నాగర్‌కర్నూల్ రూరల్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన నిర్వహించిన సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్మికులు సాధించుకున్న 44 చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్‌లుగా విభజించేందుకు ప్రయత్నంచిందని, ఇది సరికాదన్నారు. కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు లేకుండా, ప్రభుత్వాలను ప్రశ్నించకుండా ఈ లేబర్ కోడ్‌లు ఉపయోగపడతాయన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వం విధానాన్ని ఎండగడతామన్నారు. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేస్తూ పెట్టుబడిదారులకు అప్పగిస్తే సామాన్యుడికి రిజర్వేషన్ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేవారు. దేశంలో ప్రజలను చైతన్యవంతులుగా చేసి మోదీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే దాకా ప్రజా ఉద్యమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి పర్వతాలు, నాయకులు ఈశ్వర్, దశరథం, రామయ్య, సత్యం, బాలపీరు, శ్రీనివాసులు పాల్గొన్నారు.