చిగురిస్తున్న ఆశలు | Sakshi
Sakshi News home page

చిగురిస్తున్న ఆశలు

Published Mon, May 15 2023 1:42 AM

అచ్చంపేట ఎత్తిపోతల పథకం సర్వే(పైల్‌) 
 - Sakshi

అచ్చంపేట ఎత్తిపోతలకు రూ.1,534 కోట్లతో పరిపాలన అనుమతులు

ఎక్కడి నుంచి తెస్తారంటే..

ఏదుల రిజర్వాయర్‌ నుంచి 29 కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌ ద్వారా... లింగాల మండలం సూరాపూర్‌కు నీటిని తరలిస్తారు. ఇక్కడ ఏర్పాటు చేసే పంప్‌హౌస్‌ వద్ద 83 మీటర్ల ఎత్తున 8 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు పంపుల ద్వారా ఎత్తిపోసిన నీటిని గ్రావిటీ పైపులైన్‌ ద్వారా ఉమామహేశ్వరం రిజర్వాయర్‌కు తరలిస్తారు. ప్రతిరోజు 0.1 టీఎంసీ నీటిని ఎత్తిపోస్తూ 30 రోజుల పాటు 2.67 టీఎంసీల నీటిని తరలించేలా ఈ పథకం రూపకల్పన చేశారు.

అచ్చంపేట: ఎలాంటి సాగునీటి వనరులు లేని నల్లమలలోని ఎత్తయిన ప్రాంతానికి మంచి రోజులు రానున్నాయి. బీడు భూములుగా మారిన నేలలు పచ్చబడనున్నాయి. ఎత్తిపోతల ద్వారా అచ్చంపేట నియోజకవర్గంలో సాగునీరు పారించేందుకు ప్రభుత్వం చకచకా అడుగులు వేయడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 2021 ఏప్రిల్‌లో అచ్చంపేట ఎత్తిపోతల పథనికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పట్లో సర్వే పనులు కూడా పూర్తి చేశారు. సీఎం కేసీఆర్‌ ఇటీవల జరిగిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమీక్షలో టెండర్లకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో తాజాగా అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి పరిపాలన ఆమోదం తెలిపింది. ఈ నెలఖారు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జూన్‌ 15 తర్వాత సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. అత్యంత ఎత్తయిన ప్రాంతాలైన ఐదు మండలాలకు నీరందించేలా రెండు దశలో నీటిని ఎత్తిపోసే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఖరారైన అలైన్‌మెంట్‌ ప్రకారం పాలమూరు–రంగారెడ్డి పథకంలో రెండో రిజర్వాయర్‌ ఏదుల నుంచి కొత్తగా నిర్మించనున్న ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోయనున్నారు. ఐదు మండలాల పరిధిలో 61 గ్రామాలకు 57,200 ఎకరాలకు సాగు, తాగునీరు అందించడానకి రూ.1,534.50 కోట్లు కేటాయిస్తూ మొదటి దశ పనులు చేపట్టేందుకు ఆర్థికశాఖ నిర్ణయం తీసుకుంది. అచ్చంపేట ఎత్తిపోతల పథకంలో భాగంగా 4,142 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంటుంది.

సాగునీరు అందే మండలాలు,

ఆయకట్టు వివరాలిలా..

మండలాలు ఆయకట్టు (ఎకరాల్లో)

అచ్చంపేట 29,328

బల్మూర్‌ 18,122

లింగాల 4,873

ఉప్పునుంతల 1,128

తెల్కపల్లి 3,749

మొత్తం 57,200

నెలాఖరులో టెండర్లు ఖరారు

జూన్‌ 15తర్వాత సీఎం చేత శంకుస్థాపన చేసే అవకాశం?

పాలమూరు–రంగారెడ్డి రెండో రిజర్వాయర్‌ ఏదుల నుంచి సాగునీరు

అనుమతులు వచ్చాయి

మొదటి దశలో చేపట్టే పనులకు రూ.1,534.50కోట్లతో పరిపాలన అనుమతులు వచ్చాయి. టెండర్‌ ప్రక్రియ సిద్ధమవుతోంది. ఇందులో నాలుగు కెనాల్స్‌ ఉన్నాయి. మూడు గ్రామాల మధ్య ఉమామహేశ్వర రిజర్వాయర్‌ నిర్మాణం జరుగుతుంది. నెలరోజుల్లో అచ్చంపేట ఎత్తిపోతలకు శంకుస్థాపన జరగనుంది. ఏదుల రిజర్వాయర్‌ నుంచి ఓపెన్‌ కేనాల్‌ ద్వారా సూరాపూర్‌కు నీటిని తరలించి లిఫ్ట్‌ ద్వారా ఉమామహేశ్వర రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు.

– సత్యనారాయణగౌడ్‌, డీఈఈ

ఎత్తిపోతల పథకం మ్యాప్‌ పరిశీలిస్తున్న
ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు(ఫైల్‌)
1/1

ఎత్తిపోతల పథకం మ్యాప్‌ పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు(ఫైల్‌)

Advertisement
Advertisement