అప్పుడే.. బాగుండె! | - | Sakshi
Sakshi News home page

అప్పుడే.. బాగుండె!

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

అప్పుడే.. బాగుండె!

నాడు ఎంజీఎంలో విజయవంతంగా హార్ట్‌ సర్జరీలు

కాశిబుగ్గ: నాడు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్‌ అమరవాది ప్రభాకరాచారి విధులు నిర్వర్తించిన సమయంలో హృద్రోగుల వెతలు తీరాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఆస్పత్రిలో కార్డియో థొరాసిక్‌ సర్జరీ యూనిట్‌ ద్వారా రెగ్యులర్‌గా గుండె జబ్బులకు చికిత్స చేసేవారు. ముఖ్యంగా యూనిట్‌కు హెడ్‌గా ఉన్న డాక్టర్‌ అమరవాది ప్రభాకర్‌ 2004, మే 24న తొలిసారి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసి పేరు సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నేడు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన కార్డియో థొరాసిక్‌ సర్జరీ యూనిట్‌ నామ్‌కే వాస్తేగా పనిచేస్తోంది. కనీసం డాక్టర్‌ అమరవాదిని స్ఫూర్తిగా తీసుకుని ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేస్తారని ఆశించిన హృద్రోగులకు నిరాశ మిగిల్చింది. లక్షలాది రూపాయల పరికరాలు, ఫ్యాకల్టీ ఉన్నా హార్ట్‌ సర్జరీల జోలికి వెళ్లడం లేదు. దీంతో పేద రోగులు అధిక డబ్బులు పెట్టి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తున్నారు.

నేడు మూతపడిన కార్డియో థొరాసిక్‌ యూనిట్‌..

గతంలో ఎంజీఎంలో ఉన్న కార్డియో థొరాసిక్‌ యూనిట్‌ను సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు మార్చారు. ఈ యూనిట్‌ నామమాత్రంగా కొనసాగుతోంది. ఫ్యాకల్టీ ఉన్నా అధికారులు గుండె శస్త్ర చికిత్సలు చేయించడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం కార్డియో థొరాసిక్‌ యూనిట్‌లో ఒక ప్రొఫెసర్‌, ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఒక ఫర్‌ఫ్యూజనిస్టు ఉన్నారు. వీరితో బైపాస్‌ సర్జరీలు చేయించే అవకాశమున్నా ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఏసీ సెంట్రల్‌ సిస్టం లేకపోవడంతో సర్జరీలు చేయడం లేదని తెలుస్తోంది. దాదాపు రెండేళ్ల నుంచి ఈ యూనిట్‌ మూతబడి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. కాగా ఈ యూనిట్‌లో గతంలో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలు చేయకపోయినా ఐదుగురికి గుండె శస్త్ర చికిత్సలు చేశారు. మరో 40 వరకు వాస్కులర్‌ సర్జరీలు చేశారు. దీనివల్ల ఆరోగ్యశ్రీ ద్వారా ఆస్పత్రికి రూ.60లక్షల వరకు ఆదాయం సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం హృద్రోగులకు ఓపీ సేవలు అందిస్తూ మిగతా సమయంలో ఫ్యాకల్టీ మొత్తం ఖాళీగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

కొన్నేళ్లుగా ఆగిన శస్త్రచికిత్సలు

సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌లోనూ నిలిచిన సేవలు

2004, మే 24న తొలిసారి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ

డాక్టర్‌ అమరవాది ఆధ్వర్యంలో కొనసాగిన ఆపరేషన్లు

డాక్టర్‌ అమరవాదికి నాటి సీఎం ప్రశంసలు..

2004 నుంచి 2007 వరకు డాక్టర్‌ అమరవాది ప్రభాకరాచారి ఎంజీఎంలో కార్డియో థొరాసిక్‌ సర్జన్‌గా విధులు నిర్వర్తించారు. నాడు కార్డియాలజీతో పాటు కార్డియో థోరాసిక్‌ యూనిట్‌లు పనిచేశాయి. ముఖ్యంగా 2004లో ఎంజీఎం చరిత్రలో తొలిసారి వరంగల్‌కు చెందిన రమ్య అనే యువతికి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ విజయవంతం చేసి రాష్ట్రవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. నాలుగేళ్ల కాలంలో పలువురికి సర్జరీలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంజీఎం వచ్చిన సమయంలో డాక్టర్‌ అమరవాదిని మెచ్చుకున్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇక్కడినుంచే ప్రకటించినట్లు చెబుతున్నారు. కాగా డాక్టర్‌ అమరవాది ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తూ ఆన్‌లైన్‌ ద్వారా గుండె సంబంధ వ్యాధులకు సలహాలు ఇస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement