పస్రా పోలీస్‌స్టేషన్‌ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

పస్రా పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

గోవిందరావుపేట: పరిపాలన సామర్థ్యాన్ని బలోపేతం చేయడం, రికార్డులు సరైన నిర్వహణకు నిర్థారించే లక్ష్యంతో ములుగు డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ) రవీందర్‌, పస్రా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ దయాకర్‌తో కలిసి శుక్రవారం పస్రా పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా అధికారులు కేస్‌ డైరీ (సీడీ) ఫైళ్లు, స్టేషన్‌ రికార్డులు, ఇతర రిజిస్టర్లను పరిశీలించారు. డాక్యుమెంటేషన్‌ సక్రమంగా నిర్వహించబడుతుందా, క్రమం తప్పకుండా అప్డేట్‌ చేస్తున్నారా అని తనిఖీ చేశారు. రిసెప్షన్‌ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానాలను సమీక్షించారు. స్టేషన్‌ పరిపాలన, పరిశుభ్రత, రికార్డు నిర్వహణ విధానాలను సమీక్షించారు. రికార్డులను ఖచ్చి తంగా నిర్వహించడం, ప్రజలకు సత్వర సేవలు అందించడం, సిబ్బంది అప్రమత్తంగా ఉండాల ని సిబ్బందికి సూచించారు. తనిఖీ సందర్భంగా ఎస్సై తాజుద్దీన్‌ను నిబంధనల పట్టింపుపై ఎప్పటికప్పుడు ఫాలోఅప్‌ చేయాలని ఆదేశించారు.

నేడు బూర్గుపేటలో ప్రజాదర్బార్‌

వెంకటాపురం(ఎం): ప్రజల సమస్యలను స్థానికంగానే తెలుసుకొని పరిష్కరించే విధంగా గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నేడు (శనివారం) మండలంలోని బూర్గుపేట ఆశ్రమ పాఠశాలలో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలపై దరఖాస్తులను అందజేయాలని కోరారు.

సత్తన్న వర్ధంతి సభను విజయవంతం చేయాలి

గోవిందరావుపేట: సీపీఐ(ఎంఎల్‌) ప్రజాప్రతిఘటన రాష్ట్ర కమిటీ కార్యదర్శి సామ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దుంపెల్లిగూడెం గ్రామంలో నేడు నిర్వహించనున్న సామ అంతిరెడ్డి అలియాస్‌ సత్తన్న పూలక్క వర్ధంతి సభను విజయవంతం చేయాలని పీవైఎల్‌ రాష్ట్ర కన్వీనర్‌ పావురాల భిక్షపతి పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర రైతు కూలీ సంఘం అధ్యక్షుడు బొబ్బల సాంబయ్య ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారని, ప్రజలు, మేధావులు, ప్రజాసంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

దరఖాస్తుల ఆహ్వానం

ములుగు రూరల్‌: సమ్మక్క, సారక్క కేంద్రియ విశ్వవిద్యాలయంలో ఐదు విద్యా విభాగాల్లో 17 అధ్యాపక పోస్టుల భర్తీ కోసం గెస్ట్‌ ప్యాకల్టీ విధానంలో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ వైఎల్‌ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు తెలిపారు. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ కంప్యూటరింగ్‌, డాటా సైన్స్‌ అనలైటిక్స్‌, ఇంగ్లిష్‌, ఎకానమిక్స్‌ విభాగంలో అన్‌ రిజర్వుడ్‌ కోటా 6, ఈడబ్ల్యూఎస్‌ కోటా 2, ఓబీసీ కోటా 5, ఎస్సీ 3, ఎస్టీ 1 పోస్టులు (మొత్తం 17) భర్తీ చేయన్నుట్లు తెలిపారు. అభ్యర్థులు ఈనెల 19వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక పక్రియ యూనివర్సిటీ నిబంధనల మేరకు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

యువకుడి దుర్మరణం

మంగపేట: ద్విచక్ర వాహనం అదుపుతప్పి మండలంలోని అబ్బాయిగూడెంకు చెందిన కోరెం అరుణ్‌ (23) అనే యువకుడు మృతి చెందాడు. ఎస్సై టీవీఆర్‌ సూరి తెలిపిన వివరాల ప్రకారం.. అరుణ్‌ మండలంలోని కత్తిగూడెం గోదావరి ఇసుక ర్యాంపులో పనిచేస్తున్నాడు. పని ప్రదేశం నుంచి గురువారం రాత్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్నాడు. రాత్రి సమయంలో మార్గమధ్యలోని వాడగూడెం వద్దకు వచ్చే సరికి ద్విచక్ర వాహనం అదుపుచేయలేక రోడ్డు పక్కన పంట పొలలాల్లోకి దూసుకుపోయింది. దీంతో తల నుదుటిభాగం వాహనం హ్యాండిల్‌కు బ లంగా గుద్దుకోవడంతో అధిక రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి సమయం కావడంతో సంఘటనను ఎవరు కూడా గమనించకపోవడంతో వెలుగులోకి రాలేదు. శుక్రవారం ఉదయం గ్రామస్తులు సంఘటనా స్థలంలో అరుణ్‌ మృతి చెంది ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు కోరెం అంజమ్మ, నారాయణ కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించిన తీరు ప్రతిఒక్కరిని కంటనీరు తెప్పించింది. మృతుడి తండ్రి నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్న ఎస్సై సూరి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement