ప్రజాదర్బార్‌తో సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రజాదర్బార్‌తో సమస్యల పరిష్కారం

Jun 6 2026 12:53 AM | Updated on Jun 6 2026 12:53 AM

మంత్రి ధనసరి సీతక్క

ఎస్‌ఎస్‌తాడ్వాయి: ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రత్యేక ప్రజాదర్బార్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని పోచాపూర్‌, లింగాల గ్రామాల్లో నిర్వహించిన ప్రజాదర్బార్‌ కార్యక్రమానికి మంత్రి సీతక్క, కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పోలతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో అటవీ అనుమతుల కారణంగా నిలిచిన రహదారి పనులకు అవసరమైన అనుమతులు సాధించి వేగవంతం చేయనున్నట్లు వెల్లడించారు. రైతులకు రెండు పంటలకు సాగునీరు అందించే లక్ష్యంతో వాగులు, చెరువుల అభివృద్ధికి రూ.70 నుంచి రూ.80 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు మాట్లాడుతూ ప్రజావాణికి దూర ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామాలకు చేరువగా ప్రజాదర్బార్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలియజేస్తే వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పనిచేస్తుందన్నారు. అంతకుముందు రూ.10 లక్షలతో నిర్మించిన అంతర్గత రహదారి, రూ.20 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అలాగే రూ. 11కోట్లతో బొల్లెపల్లి –పోచాపూర్‌, పోచాపూర్‌–అల్లిగూడెం బీటీ రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, డీఎఫ్‌ఓ వికాస్‌మీనా, అడిషనల్‌ కలెక్టర్లు మహేందర్‌జీ, వసంతరావు, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్శన్‌ రేగ కల్యాణి, సర్పంచులు మంకిడి మొగిలిపల్లి రవీందర్‌, మంకిడి శ్రీలత, డీపీఓ వెంకయ్య, ట్రైబల్‌ ఈఈ వీరభద్రం పాల్గొన్నారు.

అడవుల పరిరక్షణతోనే పర్యావరణ

సమతుల్యం

ములుగు రూరల్‌: అడవుల పరిరక్షణతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఇంచర్ల ఎకో పార్కులో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అడవుల పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కీలకమన్నారు. అనంతరం అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సందర్శించారు. అలాగే దేవగిరి పట్నంలో అడవిపందుల దాడిలో మృతి చెందిన వెంకటేశ్వరరెడ్డికి రూ.పది లక్షల ఆర్థిక సాయం చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో అటవీ సంరక్షణ అ ధికారి కాళేశ్వరం జోన్‌ (సీసీఎఫ్‌ఓ) ప్రభాకర్‌, కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు, ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement