గోవిందరావుపేట: ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, గ్రామ పరిశుభ్రత కార్యక్రమాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు మండలంలోని చల్వాయి గ్రామ పంచాయతీకి రాష్ట్రస్థాయి ఉత్తమ పర్యావరణ పనితీరు అవార్డు లభించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో చల్వాయి గ్రామ పంచాయతీ చేపట్టిన తడి–పొడి చెత్త సేకరణ, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణ, మొక్కల పెంపకం, పర్యావరణ హిత కార్యక్రమాలు, పరిశుభ్రత చర్యలు, గ్రామ సుందరీకరణ పనులను పరిశీలించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మేకల రాధసుదర్శన్ మాట్లాడుతూ చల్వాయి గ్రామాన్ని పరిశుభ్రమైన పచ్చదనంతో కూడిన ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యమని, గ్రామ ప్రజల సహకారం, పంచాయతీ సిబ్బంది కృషి, ప్రజాప్రతినిధుల సమష్టి ప్రయత్నాల ఫలితంగానే ఈ అవార్డు లభించిందన్నారు. ఈ గుర్తింపు గ్రామాభివృద్ధికి మరింత ప్రేరణగా నిలుస్తుందన్నారు. కాగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ సనత్‌నగర్‌లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ పురస్కారం అందించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


