వెంకటాపురం(ఎం): గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కేశవాపూర్ లో గురువారం నిర్వహించిన గ్రామసభకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను సందర్శించి గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామసభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి పనులను ప్రణాళికతో అమలు చేస్తామని, డీఆర్‌డీఏ, ఎంపీడీవోలు, ఎంపీఓల సమన్వయంతో జిల్లా స్థాయిలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని వెల్ల డించారు. రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అందించే పథకాల ప్రయోజనాలు సకాలంలో అందాలంటే నమోదు కీలకమని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో ప్రజలు అధికంగా పాల్గొనాలని, ఉపాధి పనుల్లో కార్మికుల భాగస్వామ్యం పెరిగితే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, వీఓ భవనాలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు లభించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, పంచాయతీరాజ్ శాఖ అధికా రులు, గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికా రులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
సందర్శకులకు మెరుగైన సేవలు అందించాలి
గోవిందరావుపేట: లక్నవరం సరస్సుకు వచ్చే సందర్శకులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. మండల పరిధిలోని లక్నవరం సరస్సును కలెక్టర్ గురువారం సందర్శించారు. పర్యాటకకేంద్రంగా పేరుగాంచిన లక్నవరం సరస్సులో పర్యాటకులకు అందుతున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సరస్సు పరిసర ప్రాంతాలు, ఉయ్యాల వంతెన, బోటింగ్ కేంద్రం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, పరిశుభ్రత నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అదికారులకు పలు సూచనలు చేశారు. పర్యాటకులకు అసౌకర్యాలు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే బోటింగ్ కార్యకలాపాల్లో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సరస్సు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించాలని సూచించారు.
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


