గోదావర్రీ | - | Sakshi
Sakshi News home page

గోదావర్రీ

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

ప్రతిఏటా కోతకు గురవుతున్న ఒడ్డు కాంక్రీట్‌ వాల్‌ ఊసేలేదు.. భారీ వరదలతో నష్టం

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు సాయిని లక్ష్మీనర్సయ్య. ఏటూరునాగారంలోని శంకరాజుపల్లి. ముళ్లకట్ట శివారు ప్రాంతంలో 106/బీ సర్వే నంబర్‌లోని ఒక ఎకరం భూమి గోదావరి వరదలో కలిసిపోయింది. పక్కనే మరో 20 గుంటల భూమి ఉండగా క్రమంగా అదికూడా ఆనవాళ్లు లేకుండా పోయింది. ప్రతీ ఏడాది మిర్చి పంటను ఎక్కువగా పండించేవారు. ఎకరంన్నర భూమి కనుమరుగు అయ్యింది. అందులో బోరు పాయింట్‌ సైతం గోదావరిలోనే కలిసిపోయింది. ఈయనతో పాటు మరో 33 మంది రైతులు భూములు కూడా గోదావరిలోనే కలిసిపోయాయి.

ఏటూరునాగారం: జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు గోదావరి పరీవాహక ప్రాంతాలకు చెందిన రైతులు, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గోదావరి వరదలకు విలువైన పంట భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉండడంతో పాటు పలు గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఒడ్డు వెంట కాంక్రీట్‌ వాల్స్‌తో పాటు కరకట్ట నిర్మాణ పనులు చేపట్టాలని సర్వే బృందం ఇచ్చిన ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పలు ప్రాంతాల్లోని గోదావరి మూలమలుపుల వద్ద ఉన్న భూమి ఎక్కువగా ఒర్లిపోతుంది. ఏటూరునాగారంలోని 6 చోట్ల, కన్నాయిడెంలో 5 చోట్ల, మంగపేట మండలంలోని 8 చోట్ల మూలమలుపులున్నాయి.

రైతుల ఒత్తిడి మేరకు 2024లో అప్పటి సర్వే బృందం అవసరమైన చోట్ల క్రాస్‌ సెక్షన్లు(నీటి ప్రవాహ వేగాన్ని నియంత్రించేందుకు తీరం వద్ద నదిలో కాంక్రీట్‌ వాల్‌ నిర్మాణాలు) నిర్మాంచాల్సి ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దాని ఆధారంగానే జియోట్యూబ్స్‌ ప్రతిపాదన చేయగా ప్రస్తుతం రామన్నగూడెం వద్ద పనులు కొనసాగుతున్నాయి. కాని ముళ్లకట్ట, రొయ్యూర్‌, శంకరాజుపల్లి, ఓడవాడ, రాంనగర్‌, కమలాపురం ప్రాంతాల్లో రాతికట్టడాలను కట్టాల్సి ఉండగా ఆ పనులు మొదలు కాలేదు. స్థానిక వాగులు, వంకల నుంచి వచ్చే వరదను గోదావరి నదిలోకి ఎత్తిపోయడానికి ఏడు చోట్ల లిఫ్టుల ఏర్పాటు చేయాల్సి ఉందని నివేదికలు ఇచ్చారు. పంపుల ఏర్పాట్లకు సుమారు రూ. 700 కోట్ల బడ్జెట్‌ కావాల్సి ఉంది. గోదావరికి ఇరువైపులా కరకట్టల నిర్మాణంతో పాటు స్థానిక ప్రవాహాలను నది దిగువ భాగంలో కలిపేలా ప్రత్యేకంగా కాల్వల నిర్మాణం చేయాల్సి ఉంది. అన్ని నిర్మాణాలకు సుమారు రూ. 4,100 కోట్ల వరకు బడ్జెట్‌ అవసరమని నివేదికలో సర్వే బృందం పేర్కొంది. ఇవి ప్రతిపాదనల దశలోనే ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

1986లో అత్యంత భారీ వరదలు రావడంతో అనేక ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి. దాని ఆధారంగానే 1991లో ఎక్కెల నుంచి రామన్నగూడెం, మంగపేట వరకు 10.64 కరకట్ట నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత ఎలాంటి నిర్మాణాలు జరగలేదు. 2022లో అతి భారీ వరదలు వచ్చాయి. ఈ సారి ఏజెన్సీ గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేసి అప్పటి ప్రభుత్వానికి రూ.119 కోట్లతో వరద ముంపు ఉన్న ప్రాంతాలకు కాంక్రీట్‌ వాల్‌ నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. కానీ ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో ఒక్క అడుగు పడలేదు.

కనుమరుగవుతున్న విలువైన

పంటభూములు

ఇబ్బందులు పడుతున్న రైతులు

కాగితాలకే పరిమితమైన రక్షణ చర్యలు

కానరాని కాంక్రీట్‌వాల్‌, కరకట్టల నిర్మాణం

Advertisement
 
Advertisement
Advertisement