సర్వీస్‌ రికార్డే కీలకం..!? | - | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ రికార్డే కీలకం..!?

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

పోలీస్‌శాఖలో కొత్త ఫార్ములా..

పోస్టింగ్‌ల ‘రాజకీయా’నికి డీజీపీ బ్రేక్‌

‘సేఫ్‌ పోస్టింగ్‌’లకు ‘డిప్యుటేషన్‌’తో చెక్‌.. లూప్‌లైన్‌ డ్యూటీలు ఇక తప్పనిసరి

ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల కంటే డీజీపీ రూల్సే పవర్‌ఫుల్‌

ఒకేచోట ఉంటే కూడా ఔట్‌...

పోలీస్‌వర్గాల్లో కలకలం

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పోలీస్‌శాఖలో తప్పనిసరి డిప్యుటేషన్‌ విధానం మళ్లీ అమల్లోకి రాబోతుంది. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్‌ కొత్త నిబంధనలను అమలు చేసే పనిలో పడ్డారు. పోలీస్‌ అధికారి ఇకపై ప్రమోషన్‌కు ముందు.. తర్వాత కనీసం రెండేళ్లయినా డిప్యుటేషన్‌పై లూప్‌లైన్‌ పోస్టింగుల్లో పనిచేయాల్సిందే. గతంలోనూ ఈ నిబంధనలున్నా.. రాజకీయ పలుకుబడి, పైరవీల కారణంగా అమలు కాలేదు. చాలామంది సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి డీఎస్పీ/ఏసీపీల వరకు శాంతిభద్రతల విభాగంలోనే కొనసాగుతూ వస్తున్నారు. డీజీపీ కొత్త ఫార్ములా అమల్లోకి వస్తే డిప్యుటేషన్‌పై ఇతర యూనిట్లలో పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కనుంది. సిఫార్సులు కాకుండా సర్వీస్‌ రికార్డులు ప్రామాణికంగా పదోన్నతులు, పోస్టింగ్‌లు దక్కనున్నాయన్న చర్చ ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారింది.

బదిలీ లేదా డిప్యుటేషన్‌..

పలువురు అధికారులకు ఎఫెక్ట్‌..

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు ములుగు, మహబూబాబాద్‌, జేఎస్‌ భూపాలపల్లి జిల్లాల్లో పలువురిపై బదిలీ లేదా డిప్యుటేషన్‌ వేటు తప్పేట్టులేదు. డీఎస్పీ, ఏసీపీ, సీఐ, ఎస్‌ఐ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు గణనీయ సంఖ్యలో ఐదేళ్లకు పైగా ఒకే ప్రాంతంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీఎస్పీ/ఏసీపీలు 10–15 మంది, సీఐలు 30 మందికిపైగా, ఎస్‌ఐలు 40–50 మంది వరకు ఉండగా, కొత్త విధానం అమలైతే వీరంతా బదిలీ, డిప్యుటేషన్‌ పరిధిలోకి వచ్చే అవకాశముందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. సీఐ, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న పలువురు రెండు నుంచి మూడు ప్రమోషన్లు పొందినా.. చాలామంది సీఐడీ, డీసీఆర్‌బీ, పీసీఆర్‌, పీటీసీ, సీటీసీ, ఇంటెలిజెన్స్‌ తదితర లూపులైన్‌ విభాగాలవైపు కన్నెత్తయినా చూడలేదు. దీంతో డీజీపీ కొత్త నిర్ణయంతో ఉమ్మడి వరంగల్‌లో చాలామందికి డిప్యుటేషన్‌లు తప్పవన్న చర్చ జరుగుతోంది. కుటుంబం, పిల్లల విద్య, స్థానిక అనుబంధాల కారణంగా కొందరు సీనియర్‌ అధికారులు డిప్యుటేషన్‌లు, బదిలీల నిర్ణయంపై ఆందోళన చెందుతుండగా, కీలక పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్న యువ అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఒకే వర్గం అధికారుల ఆధిపత్యానికి చెక్‌ పడి కీలక పోస్టుల్లో కొత్తవారికి అవకాశాలు లభిస్తాయని, ఫీల్డ్‌, లాఅండ్‌ఆర్డర్‌, ఇంటెలిజెన్స్‌ ట్రాఫిక్‌ విభాగాల్లో అనుభవం, పోస్టింగ్‌లలో పారదర్శకత పెరిగే అవకాశం ఉంటుందని వారంటున్నారు.

లూప్‌లైన్‌ విధులు తప్పనిసరి..

దీర్ఘకాలికంగా శాంతిభద్రతల విభాగంలో పనిచేసే అధికారులకు లూపులైన్‌ పోస్టింగ్‌లు తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు పట్టణ పోలీస్‌ స్టేషన్లు, ట్రాఫిక్‌, టాస్క్‌ఫోర్స్‌, ప్రత్యేక విభాగాల పోస్టింగులలో రాజకీయ ప్రభావం కీలక పాత్ర పోషించేదన్న అభిప్రాయం ఉంది. కొత్త విధానం అమలైతే ఒకేచోట ఎక్కువకాలం కొనసాగడం కష్టమవడంతోపాటు సిఫార్సుల ప్రభావం కూడా తగ్గే అవకాశముంది. ఒకే కమిషనరేట్‌, జిల్లా లేదా ప్రత్యేక విభాగంలో ఐదేళ్లకు పైగా కొనసాగుతున్న అధికారులను ఇతర యూనిట్లు, జిల్లాలు లేదా విభాగాలకు పంపడం అనివార్యం కానుంది. ఇకపై పోస్టింగ్‌లలో వ్యక్తిగత సిఫార్సుల కంటే సర్వీస్‌ రికార్డు, పనితీరు, పరిపాలనా అవసరాలకే ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

సీపీ/ఎస్పీ కార్యాలయాలు 04

ఏసీపీ/డీఎస్పీ కార్యాలయాలు 21

సర్కిల్‌ కార్యాలయాలు 26

మొత్తం పోలీసుస్టేషన్లు 91

Advertisement
 
Advertisement
Advertisement