న్యూస్‌రీల్
ములుగు
మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026
12 ఏళ్లలో మారిన ములుగు రూపురేఖలు
7
అడవుల ఖిల్లాగా పేరొందిన ములుగు ఏజెన్సీ ప్రాంతం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు అనేక రంగాల్లో వెనుకబడిన గిరిజన ప్రాంతం నేడు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. 12 ఏళ్లలో అనేక మార్పులతో ములుగు ముఖచిత్రం మారింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత నాడు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి చందూలాల్, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క జిల్లా అభివృద్ధితో పాటు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జిల్లా సాధించిన అభివృద్ధిపై సాక్షి ప్రత్యేక కథనం..
– ములుగు/ములుగు రూరల్/ఏటూరునాగారం/ఎస్‌ఎస్ తాడ్వాయి
● 2019లో 33వ జిల్లాగా ఏర్పాటు
● 2025లో మున్సిపాలిటీగా ఆవిర్భావం
● వైద్య కళాశాల, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతో మహర్దశ
మేజర్ పంచాయతీ నుంచి జిల్లాగా..
2011లో మేజర్ గ్రామపంచాయతీగా ఏర్పాటైన ములుగును 2019 ఫిబ్రవరి 17న 33వ జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లాలో కన్నాయిగూడెం మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేసి 174 గ్రామ పంచాయతీలతో జిల్లా ఏర్పాటు చేశారు. 2025 ఏప్రిల్ 5న ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. అంతేకాకుండా మంత్రి సీతక్క చొరవతో మాజీ జెడ్పీ చైర్మన్ జగదీశ్ పేరుతో మల్లంపల్లి గ్రామాన్ని జేడీ మల్లంపల్లి మండలంగా ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం 2021 జూలై 25న రామప్పకు యునెస్కో గుర్తింపు లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రశాద్ ప్రాజెక్ట్ కింద రూ.62 కోట్ల నిధులతో రామప్ప ఆలయ పరిసర ప్రాంతాల్లో అభివృద్ది పనులు చేపడుతోంది.
దేవాదుల నీటితో పెరిగిన ఆయకట్టు
కన్నాయిగూడెం మండలం గంగారం వద్ద గోదావరి నదిపై నిర్మిందిన దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా రామప్ప సరస్సును రిజర్వాయర్‌గా మార్చి దేవాదుల నీటిని అందిస్తుండడంతో జిల్లాలో ఆయకట్టు సాగు పెరిగింది. ములుగు, వెంకటాపురం(ఎం), గోవిందరావుపేట, గణపురం మండలాలకు చెందిన రైతులు సాగునీటికి కొరత లేకుండా రెండు పంటలు సాగు చేసుకుంటున్నారు. ఒకప్పుడు 80 వేల ఎకరాలకే ఆయకట్టు సాగుకు పరిమితమైన జిల్లాలో ప్రస్తుతం 1.80 లక్షల ఎకరాల భూములు సాగు అవుతున్నాయి. జిల్లాలో అయిల్‌పామ్ సాగు పెంపుతో మంత్రి సీతక్క సహకారంతో జవహర్‌నగర్ సమీపంలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పునాదులు పడ్డాయి.
విద్య, వైద్యంలో పురోగతి
జిల్లా విద్య, వైద్యంలో పురోగతి సాధించింది. విద్యలో 65 శాతం ఉత్తీర్ణత ఉన్న జిల్లా ప్రస్తుతం 90 శాతానికి పైగా పెరిగింది. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమస్థానంలో నిలిచింది. అలాగే గత ప్రభుత్వం 2023 మే నెలలో వైద్య కళాశాల నిర్మాణానికి 25 ఎకరాల భూమిని అప్పగించి రూ.60 కోట్లను కేటాయించి పనులు ప్రాంభించింది. జిల్లా కేంద్రంలోని కళాశాలకు కేటాయించిన స్థలంలో మూడు భవనాలను నిర్మించి 2024–25 నుంచి వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రి జనరల్ ఆస్పత్రిగా మారిపోయింది. మెడికల్ కళాశాల విద్యార్థులకు తరగతుల బోధన, ఆస్పత్రి విధులకు 48 మంది వైద్యులు వైద్యసేవలు అందిస్తున్నారు. మెడికల్ కళాశాలలో ఇప్పటి 100 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేసి సమ్మక్క–సారలమ్మ సెంట్రల్ గిరిజన యూనివర్సిటీగా నామకరణం చేశారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీ భవన నిర్మాణాలకు రూ. 900 కోట్లు కేటాయించింది. 2023–24 విద్యాసంవత్సరంలో తరగతులను ప్రారంభించింది.
కంటైనర్ ఆస్పత్రులు, పాఠశాలల ఏర్పాటు
ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని కొడిశాలలో పూరి గుడిసెలో ఉన్న ఆస్పత్రిని ప్రస్తుతం కంటైనర్ ఆస్పత్రిలోకి మార్చారు. మంత్రి సీతక్క చొరవతో కంటైనర్ ఆస్పత్రిని నెలకొల్పి రోగులకు వైద్య సదుపాయాలను అందజేస్తున్నారు. ఐలాపురంలో గుడిసెలో సబ్ సెంటర్ ఉండగా ఇప్పుడు దానిని కంటైనర్ ఆస్పత్రిగా మార్చి కావాల్సిన వసతులు ఏర్పాటు చేసి రోగులకు వైద్య సదుపాయాలతో పాటు మందులు అందజేస్తున్నారు. ఎడ్జెర్ల పల్లిలో సైతం కంటైనర్ సబ్‌సెంటర్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. అలాగే కంటైనర్ పాఠశాలలను గొత్తికోయగూడేలు, గిరిజన గూడేల్లో ఏర్పాటు చేసి విద్యాబోధన చేస్తున్నారు. అలాగే జిల్లాలో నూతనంగా ఐదు పాఠశాలలను సైతం గతేడాది మంత్రి సీతక్క చొరవతో ప్రారంభం అయ్యాయి.


