ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయినపల్లి ప్రభుత్వ పాఠశాలలో 103 మంది విద్యార్థులు సోమవారం అడ్మిషన్లు తీసుకున్నారు. ఈ మేరకు విద్యార్థులు హెడ్మాస్టర్ కవిత ద్వారా అడ్మిషన్లు స్వీకరించినట్లు చిన్నబోయినపల్లి సర్పంచ్ నల్ల బోయిన నాగార్జున తెలిపారు. మండల పరిధి లోని చిన్నబోయినపల్లి డీఎన్‌టీ పాఠశాలలో ప్రత్యేక విద్యాబోధన కోసం ఎల్‌కేజీ, యూకేజీతో పాటు 7వ తరగతి వరకు ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో ప్రత్యేక బోధన, సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అడ్మిషన్లను స్వీకరించారు. కార్యక్రమంలో ఎంఈఓ మల్లయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆర్‌ఐటీఐ, ఏటీసీ అడ్మిషన్లు పొందాలి
ఏటూరునాగారం: జిల్లాలోని ఆర్‌ఐటీఐ, ఏటీసీ కేంద్రాల్లో అర్హులైన విద్యార్థులు అడ్మిషన్లను పొందాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ఆర్‌ఐటీఐ, ఏటీసీ సెంటర్ల అడ్మిషన్ల పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గిరిజన యువతకు ప్రభుత్వ ఆర్‌ఐటీఐ , ఏటీసీ సంస్థల్లో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల గురించి సమాచారం అందించడంతో పాటు శిక్షణ ఇస్తామన్నారు. నైపుణ్య ఆధారిత విద్య ద్వారా విజయవంతమైన ఉపాధి, కేరిర్ అవకాశాలను పొందేలా ప్రోత్సహించడమే లక్ష్యమని పీఓ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, యాదగిరి, మువీన్, విక్రమ్ పాల్గొన్నారు.
రామప్పలో సినిమా షూటింగ్
వెంకటాపురం(ఎం): షైన్ స్టూడియో బ్యానర్ పై రూపొందుతున్న ‘ప్రొడక్షన్ నంబర్ నెం. 2 సినిమా షూటింగ్‌ను రామప్ప దేవాలయంలో సోమవారం మంత్రి సీతక్క తనయుడు సూర్య, రైస్ మిల్లర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్ క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షైన్ స్టూడియోస్ బ్యానర్స్ సినిమాను చిత్రీకరించడం అభినందనీయమన్నారు. యూనిట్ బృందంతో కలిసి రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్లు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గిరిబాబు, ఎస్సై చల్లారాజు, ప్రొడ్యూసర్ వేణు యాదవ్, హీరో అజయ్, మూవీ డైరెక్టర్ నేరెళ్ల దేవేందర్, కో డైరెక్టర్ ఆర్య అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
49 శాతం బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో మే మాసంలో లక్ష్యంలో 49శాతం మాత్రమే బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2.38 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి గాను 1,16లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. జూన్ మాసంలో 2.35 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గైర్హాజరు శాతం తగ్గించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నారు.


