ములుగు రూరల్/ఏటూరునాగారం: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వినతులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా బాధ్యతగా వినతులు పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తంగా 100 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పింఛన్లు 37, ఇందిరమ్మ ఇళ్లు 25, ఇతర శాఖలకు సంబంధించినవి 38 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటిని పరిశీలించి ఆయా శాఖలకు బదిలీ చేశారు.
గిరిజన దర్బార్‌లో 28 దరఖాస్తులు
ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ సమస్యలపై వచ్చిన 28 దరఖాస్తులను పీఓ లెనిన్ వత్సల్ టొప్పో స్వీకరించారు. గిరిజన మహిళా టైలర్లు స్కూల్ యూనిఫాం కుట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లిలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా భూమిలో వ్యవసాయ పనుల కోసం వినియోగిస్తున్న ట్రాక్టర్‌ను హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం పారెస్టు డిపార్ట్‌మెంట్ దగ్గర నుంచి ట్రాక్టర్‌ను విడుదల చేయాలని కోరారు. ఏటూరునాగారం లంబాడీతండా శివారు ప్రాంతంలో కల్వర్టు వరకు మెటల్ రోడ్డు మంజూరు చేయాలని గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో నిర్మించిన మెటల్ రోడ్డు పనులకు ఇప్పటి వరకు బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్టర్ విన్నవించారు. ఇలా అనేక సమస్యలపై వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడీ జనార్దన్, ఈఈ వీరభద్రం, ఏఓ రాజ్‌కుమార్, డీటీ అనిల్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ అనిల్‌కుమార్, జీసీసీ డీఎం వాణి, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, జియాలజిస్ట్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ప్రజావాణిలో 100 వినతుల రాక


