● కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: ప్రకృతి పరిరక్షణే ప్రగతి ప్రణాళిక లక్ష్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి ప్రకృతిని పరిరక్షించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వన మహోత్సవ కార్యక్రమాల నిర్వహణ సమీక్ష సమావేశం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అటవీశాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు. వన మహోత్సవం ద్వారా ప్రజల్లో ప్రకృతి సంరక్షణపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించి భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, యువత, ప్రజలు వన మహోత్సవ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన సదస్సులు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమాలు, సైకిల్ ర్యాలీలు, పరిశుభ్రత కార్యక్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో క్విజ్, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఇన్‌ఛార్జ్ ఆర్డీఓ ప్రతాప్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


