కాళేశ్వరం: సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా ఆదివారం కాళేశ్వరానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, పుష్కర ఘాట్, త్రివేణి సంగమం వద్ద భక్తుల, ట్రాఫిక్ రద్దీని డ్రోన్ సహాయంతో నిరంతరం పర్యక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. భక్తుల వాహనాలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. భక్తులు నదిలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భక్తులు సురక్షితంగా పుష్కర స్నానాలు ఆచరించేలా పోలీస్ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ సూచనలు చేస్తున్నట్లు తెలిపారు.


