డివిజన్ వస్తే కొత్తమార్గాలు..
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ రైల్వే రంగంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోంది. సోమవారం నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే) జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. దీంతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా సేవలందించిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) పరిధి గణనీయంగా మారనుండగా.. ఉమ్మడి వరంగల్‌లో రైల్వే డివిజన్ ఏర్పాటు హామీగానే మిగలనుంది.
అన్నీ ఉన్నా.. డివిజన్ లేదు..
కాజీపేటను డివిజన్‌గా ఏర్పాటు చేయడానికి అనువైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యుత్ లోకోషెడ్, రెండు పిట్‌లైన్లు, భారీ రైల్వేయార్డు, కోచ్ నిర్వహణ కేంద్రం, కొత్తగా నిర్మిస్తున్న మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్), ఇంటర్‌సిటీ కోచ్ తయారీ యూనిట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాలతో కొత్త డివిజన్లు ఏర్పాటవుతున్నా అన్ని అర్హతలు ఉన్నా కాజీపేటకు మాత్రం డివిజన్ ప్రకటించకపోవడం ఉమ్మడి వరంగల్ వాసుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.
ఎన్నికల వేళ మళ్లీ తెరపైకి..
రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా అంశం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్ లభించిన నేపథ్యంలో కాజీపేట డివిజన్ ప్రకటించాలన్న డిమాండ్ ప్రజల నుంచి వినిపిస్తోంది. కాగా, ఉమ్మడి వరంగల్‌కు డివిజన్ వల్ల వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు, రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల మంజూరు, సరుకు రవాణా ఆదాయం పెరగనుంది.
1980 నుంచే ఉద్యమం..
కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ప్రకటించాల ని రైల్వే ఉద్యోగ సంఘాలు, ప్రయాణికుల సంఘాలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 1980 నుంచి ఉద్యమాలు కొనసాగుతున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అమల్లోకి వస్తుండడంతో కాజీపేట డివిజన్ కోసం ఉద్యోగ, ప్రజాసంఘాలు మళ్లీ ఉద్యమాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది.
కాజీపేటకు అన్ని అర్హతలు ఉన్నా మొండిచెయ్యే
నేటి నుంచి దక్షిణ కోస్తా రైల్వేజోన్
అమలు
డివిజన్ ఏర్పాటు కోసం ఉద్యమాలకు
సిద్ధమవుతున్న ఉద్యోగ, ప్రజాసంఘాలు
ఉమ్మడి వరంగల్ (కాజీపేట)కు డివిజన్ వస్తే కాజీపేట–బల్లార్షా, కాజీపేట–మోటుమర్రి, పెద్దపల్లి–నిజామాబాద్, డోర్నకల్–మణుగూరు, డోర్నకల్–భద్రాచలం రోడ్–సత్తుపల్లి మార్గాలు చేరే అవకాశం ఉంది. దాదాపు 695 కిలోమీటర్ల మేర విస్తరించే ఈ డివిజన్‌లో సింగరేణి బొగ్గు రవాణా కూడా ఉండడంతో ప్రారంభం నుంచే లాభాల్లో నడిచే అవకాశముందని రైల్వే అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రైల్వే పరిపాలన అంతా సికింద్రాబాద్ కేంద్రంగానే కొనసాగుతోంది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే పరిధి తగ్గనుంది. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో అత్యంత కీలక రైల్వే కూడళ్లలో ఒకటైన జంక్షన్.. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలకు వెళ్లే రైళ్లకు ప్రధాన అనుసంధాన కేంద్రంగా ఉన్న కాజీపేటను డివిజన్ చేస్తే ఉమ్మడి వరంగల్ కొత్త గుర్తింపు రానుంది.


