గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి గ్రామం గౌరారం గడ్డకు చెందిన గంగారపు ప్రజ్వల బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో 559 మార్కులు సాధించిన ప్రజ్వల ట్రిపుల్ ఐటీలో సీటు సాధించి పలువురి మన్ననలు పొందుతుంది. ఉపాధి నిమిత్తం హనుమకొండకు వెళ్లిన ప్రజ్వల తల్లిదండ్రులు గంగారపు జ్యోతి, ప్రకాశ్ అక్కడి వడ్డెపల్లి ప్రభుత్వ పాఠశాలలో కుమార్తెను చదివించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన ప్రజ్వల.. పట్టుదలతో చదువుకొని విద్యలో రాణించింది. ఈ సందర్భంగా చల్వాయి గ్రామస్తులు, బంధుమిత్రులు ప్రజ్వలను అభినందించారు.
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంసీఏ సెకండియర్ రెండో సెమిస్టర్ పరీక్షలు (సీబీసీఎస్), (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) ఈ నెల 8వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, అదనపు పరీక్షల ని యంత్రణాధికారి డాక్టర్ ఆసిం ఇక్బాల్ తెలి పారు. 8న మొదటి పేపర్, 10న రెండో పేపర్, 12న మూడో పేపర్ పరీక్షలు ఉంటాయన్నారు. ఆయా తేదీల్లో పరీక్షలు ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారని వారు పేర్కొన్నారు.
కురవి: మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో ఆదివారం భక్తులతో సందడి నెలకొంది. మండుటెండలను సైతం లెక్కచేయకుండా వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. క్యూలో నిల్చొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
విద్యారణ్యపురి: డీఈఐఈడీలో మొదటి సంవత్సరంలో తెలుగు/ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలో ప్రవేశాలకు గాను సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 2నుంచి 5వతేదీ వరకు నిర్వహిస్తామని హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపాల్ రంగయ్యనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. డీఈఈసెట్– 2026 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు వెరిఫికేషన్‌కు ర్యాంక్ కార్డు, హాల్‌టికెట్, టెన్త్, ఇంటర్మీడియట్ మెమో, 4వతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ, టీసీ, ఎన్‌సీసీ/స్పోర్ట్స్, పీహెచ్‌సీ పత్రాలతో రావాల్సింటుందన్నారు. సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అనంతరం అభ్యర్థులు 6 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.


