కిటకిటలాడిన హేమాచల క్షేత్రం | - | Sakshi
Sakshi News home page

కిటకిటలాడిన హేమాచల క్షేత్రం

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీహేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ క్షేత్రం వేలాది మంది భక్తజనంతో ఆదివారం కిటకిటలాడింది. ఆలయంలో స్వయంభు లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్‌, హైదరాబాద్‌, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్‌ తదితర ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, రాజమండ్రి, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి అధికసంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కోలాహలం మారింది. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. గంటల కొద్ది సమయం భక్తులు క్యూలో వేచి ఉండి భక్తిశ్రద్ధలతో తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. మానవ శరీరాన్ని పోలి ఉండే స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందచేశారు. ఉదయం నుంచి సాయంత్రం 05 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement