గోవిందరావుపేట: ఏజెన్సీలో రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని నకిలీ విత్తన ముఠాలు కొన్నేళ్లుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. వానాకాలంలో విత్తనాలు విత్తేందుకు దుక్కులు సిద్ధం చేసుకుని రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. గత రెండేళ్లుగా నాసిరకం విత్తనాలతో పంటలు సాగు చేసిన రైతులు నష్టపోయారు. ఈ ఏడాది అయినా అధికారులు నాసిరకం విక్రయ ముఠాలపై దృష్టి సారించాలని రైతన్నలు కోరుతున్నారు. జిల్లాలోని 10 మండలాల పరిధిలో వానాకాలంలో 1,07,700 ఎకరాల్లో వరిపంట, 28,600 ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. మొక్కజొన్న 11,329 ఎకరాల్లో, ఇతర పంటలు 15,600 ఎకరాల్లో సాగు కానున్నాయి.
నాసిరకం విత్తనాలతో నష్టం
గత రెండేళ్ల కాలంలో ఎస్‌ఎస్‌తాడ్వాయి, మంగపేట, ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లో నాసిరకం మొక్కజొన్న విత్తనాలు సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. స్థానిక ఏజెంట్లు తమ కమీషన్ల కోసం వివిధ కంపెనీల పేర్లు చెప్పి బాండ్ మొక్కజొన్న పేరుతో విత్తనాలను రైతులకు విక్రయించగా పంట ఆశించిన స్థాయిలో రాక రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఆగ్రహించిన రైతులు ఆయా కంపెనీలను నిలదీయడంతో ఎకరానికి రూ.65వేలు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చినా చివరకు అతి స్వల్ప మొత్తాలు చెల్లించి చేతులు దులుపుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. అలాగే పలు మండలాల్లో నాసిరకం మిర్చి విత్తనాలతో కూడా రైతులు భారీగా నష్టపోయారు. ఇక గోవిందరావుపేట మండల పరిధిలోని సీడ్ వరి పేరుతో విక్రయించిన విత్తనాలు సాగు చేసిన రైతులు సైతం తీవ్రంగా నష్టపోయారు.
ప్రముఖ కంపెనీల పేరుతో మోసం
సీజన్ ప్రారంభానికి ముందు కొందరు అక్రమ వ్యాపారులు ప్రముఖ కంపెనీల పేర్లతో నకిలీ ప్యాకెట్లను తయారు చేస్తారు. అసలు కంపెనీల ప్యాకింగ్‌ను పోలి ఉండేలా ముద్రించి రైతులను మోసం చేసే అవకాశం ఉంది. తక్కువ ధరకు వస్తున్నాయని భావించి రైతులు కొనుగోలు చేస్తే చివరికి భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. విత్తనం వేశాక కొన్ని రోజుల్లో మొలక రావాలి. కానీ నకిలీ విత్తనాల వల్ల మొలకలు సరిగా రాకపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలు కొనాలి. మళ్లీ భూమి చదును చేసి విత్తనాలు వేయాలి. ఇలా డబ్బులు ఖర్చు వస్తుంది. ఒకవైపు అప్పులు, మరోవైపు దిగుబడిపై అనిశ్చితి రైతును మానసికంగా, ఆర్థికంగా కుంగదీసే ప్రమాదం ఉంది. దీంతో కొనుగోళ్ల ప్రారంభానికి ముందే వ్యవసాయ అధికారులు నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. రైతులు సైతం ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. ప్యాకెట్‌పై లాట్ నంబర్, గడువు తేదీ, మొలక శాతం వివరాలను పరిశీలించాలి. అనుమానం వస్తే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
వానాకాలం విత్తనాల కొనుగోళ్లకు
రైతుల సన్నద్ధం
ఏజెన్సీలో రెండేళ్లుగా నష్టపోయిన రైతులు
నాసిరకం విత్తనాలకు అడ్డుకట్ట
వేయాలని వేడుకోలు
వరి విత్తనాల ప్యాకెట్లు 35,000
మొక్కజొన్న 400 క్వింటాళ్లు
పత్తి విత్తనాల ప్యాకెట్లు 60వేలు
పప్పు దినుసుల
విత్తనాల ప్యాకెట్లు 40 క్వింటాళ్లు
ఈ ఫొటోలోని రైతు పేరు నాంపల్లి సత్యబాబు. వాజేడు మండల పరిధిలోని ఎడ్జెర్లపల్లి గ్రామం. గతేడాది ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. నాసిరకం విత్తనాలు సాగు చేయడంతో మొలక శాతం తగ్గిపోయింది. మొక్కలు సైతం ఆశించిన విధంగా ఎదగలేదు. చివరకు దిగుబడి రాక రూ.లక్షల్లో నష్టపోయాడు.
నాసిరకం విత్తనాల నియంత్రణకు చర్యలు
ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో నాసిరకం విత్తనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లాలోని అన్ని మండలాల్లో వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశాం. విత్తన విక్రయ కేంద్రాలు, గోదాములపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. నాసిరకం విత్తనాలు విక్రయిస్తే సంబంధిత డీలర్ల లైసెన్సులను వెంటనే రద్దు చేయడంతో పాటు విత్తన చట్టం–1966 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకుంటాం. రైతుల ప్రయోజనాల పరిరక్షణకు వ్యవసాయ శాఖ కట్టుబడి ఉంది.
– వి.సురేశ్‌కుమార్, డీఏఓ


