● సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేందర్
ములుగు: గోదావరి నదిలో డిస్టిలేషన్‌ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం అదనపు కలెక్టర్ మహేందర్‌జీకి నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాపురం(కె) మండల పరిధిలోని ఎదిర, సూరవీడు, బోదాపురం గ్రామాల పరిసరాల్లోని గోదావరి నది నుంచి ఇసుక తీసేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతుల కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. సుమారు 15 కిలో మీటర్ల విస్తీర్ణంలో 4 వేల ఎకరాల్లో ఇసుకను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఈ డిస్టిలేషన్ కేవలం ఇసుక మాఫియా, బడా బాబుల కోసం చేపడుతున్నట్లు అనుమానం వస్తుందని ఆరోపించారు. గోదావరి నదిలో కోట్లాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తీయడం వల్ల ఒకవైపు పర్యావరణం, మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో సాగు, తాగునీటి సమస్యలను గిరిజనులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దామెర కిరణ్, రత్నం ప్రవీణ్, కొర్ర రాజు, తోకల రవి తదితరులు పాల్గొన్నారు.


