మంగపేట: మండల పరిధిలోని హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల కోలాహలం నెలకొంది. లక్ష్మీనర్సింహ స్వామిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సుమారు నాలుగు వేలకు పైగా భక్తులు తరలిరావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి నిరీక్షించారు. వివిధ వాహనాల్లో గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి పరవశించారు. అనంతరం అత్యంత భక్తిశ్రద్ధలతో స్వయంభు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయ పూజారులు భక్తుల గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.


