పూర్వ ప్రాథమిక పాఠశాలల పునరుద్ధరణ | - | Sakshi
Sakshi News home page

పూర్వ ప్రాథమిక పాఠశాలల పునరుద్ధరణ

May 30 2026 3:02 AM | Updated on May 30 2026 3:02 AM

‘ఎస్‌ఎఫ్‌ఐ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి’

ములుగు రూరల్‌: విద్యార్థుల సౌకర్యాల దృష్ట్యా జిల్లాలో 36 పూర్వ ప్రాథమిక పాఠశాలలను పునరుద్ధరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి పూర్వ ప్రాథమిక పాఠశాలలను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ తాజాగా ఆమోదం తెలిపినట్లు వివరించారు. దీంతో జిల్లాలో ప్రాథమిక స్థాయి విద్యా సదుపాయాలు విస్తరించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 11 పూర్వ ప్రాథమిక పాఠశాలలు కొనసాగుతున్నాయని విద్యార్థుల సంఖ్య ఆధారంగా బడులను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల సహకారంతో చిన్నారుల విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

వాజేడు: ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూన్‌ 3 నుంచి 13 వరకు జిల్లాలోని గోవిందరావుపేటలోని పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు పలు అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థలు తప్పనిసరిగా ఈ శిక్షణ తరగతులకు హాజరై జయప్రదం చేయాలని కోరారు. కరపత్రాలను విడుదల చేసిన వారిలో బోదెబోయిన సాయి, పూనెం మనోహర్‌, మురళీ కృష్ణ, శ్రీరాం, తేజ, అవినాష్‌ ఉన్నారు.

పాలిసెట్‌ ధ్రువపత్రాల పరిశీలన

భూపాలపల్లి అర్బన్‌: పాలిసెట్‌ అడ్మిషన్ల కోసం ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌, పాలిసెట్‌ సమన్వయకర్త డాక్టర్‌ ఎ.రమణారావు తెలిపారు. జూన్‌ 1వ తేదీ వరకు ధ్రువపత్రాలను పరిశీలించనున్నట్లు తెలిపారు. ప్రవేశాలు పొందే విద్యార్థులు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. ఈ పరిశీలనకు అధికారులుగా శ్రీధర్‌, దేవేందర్‌, శ్రీనివాస్‌, రాజకుమార్‌ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

కారు బోల్తా.. ఆరుగురికి గాయాలు

మల్హర్‌(కాటారం): కాళేశ్వరం వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడగా ఆరుగురికి గాయాలైన ఘటన కాటారం మండలం బస్వాపూర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన ఆరుగురు కారులో శుక్రవారం కాళేశ్వరంలో అంత్యపుష్కరాలకు వెళ్లారు. పుష్కర స్నా నాలు చేసి దర్శనం అనంతరం హనుమకొండకు తిరుగుపయనమయ్యారు. కాటారం మండలం బస్వాపూర్‌ క్రాస్‌ వద్ద కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి తీవ్ర గాయాలయ్యా యి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వా హనంలో భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

గాలివానతో కూలిన టెంట్లు

పలిమెల(కాళేశ్వరం): మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో శుక్రవారం ఉదయం గాలివాన బీభత్సం సృష్టించింది. దీంతో భక్తులకోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు, ఫ్లెక్సీలు నేలకూలాయి.

Advertisement
 
Advertisement
Advertisement