మంగపేట: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేవిధంగా చూస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ రవీందర్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 29మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అదే విధంగా వివిధ గ్రామాలకు చెందిన 13 మందికి సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీలేని రుణాలను పొదుపు సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్ధికాభివృద్ధి సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మైల జయరాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయశాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అయ్యోరి యానయ్య, చెట్టుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క


