ధాన్యం సేకరణకు ప్రత్యేక చర్యలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు ప్రత్యేక చర్యలు

May 29 2026 2:13 AM | Updated on May 29 2026 2:13 AM

ములుగు: కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని వేగంగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు అకాల వర్షాలతో ధాన్యం తడవలేదన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో కూడా రైతులు పండించిన ధాన్యమంతా కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసినా, నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 76 వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో 9 వేలకు పైగా రైతుల ఖాతాల్లో కనీస మద్దతు ధర కింద రూ.141 కోట్ల పైగా డబ్బులు జమ చేసినట్లు వెల్ల డించారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతుందని వివరించారు. అవసరమైన చోట టార్పాలిన్లు, నిల్వ సదుపాయాలు, వేగవంతమైన రవాణా ఏర్పాట్లు కల్పిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించిన అన్ని ఏజెన్సీలు, సంబంధిత శాఖల అధికారులు, డీఆర్‌డీఓలు, డీసీఓలు, జీసీసీ ప్రతినిధులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు వచ్చే పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తడవకుండా భద్రపర్చాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ వివరించారు. రైతులకు ధాన్యం కొనుగోలులో సమస్యలు, సందేహాల పరిష్కారానికి జిల్లా సివిల్‌ సప్లయీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌/కంట్రోల్‌ రూం నంబర్‌ 9347416178లో సంప్రదించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement
 
Advertisement
Advertisement