గోవిందరావుపేట: మండలంలోని చల్వాయి గ్రామం 5వ వార్డులో మరమ్మతులకు గురైన బోరు మోటారును తొలగించి కొత్త మోటారును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మాట్లాడుతూ.. నీటి సమస్యను వెంటనే గుర్తించి పరిష్కరించిన వార్డు సభ్యుడు తాటి రమణతో పాటు గ్రామ పంచాయితీ సిబ్బంది సాగర్, వెంకన్న, సాంబయ్య, ఓదేలుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏటూరునాగారం: మండలంలోని రామన్నగూడెంలో ఆర్టీసీ కండక్టర్ జుపాక తిరుపతి తల్లి ఇటీవల వడదెబ్బతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబాన్ని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ నాగజ్యోతి గురువారం పరామర్శించారు. అలాగే కందుకూరి మహేష్ తల్లి కందుకూరి సారమ్మ ఇటీవల వడదెబ్బతో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని నాగజ్యోతి పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. పల్లా మాణిక్యం, ఆకుల రోశయ్య, మూతినేని సత్యనారాయణ, తుమ్మ మల్లారెడ్డి, కోనేరు నగేష్, గడదాసు సునీల్, అంతటి నాగరాజు, ఈసం రామ్మూర్తి, కర్ర రవీందర్, రాంబాబు, చిన్ని కృష్ణ, నర్సయ్య, రమేష్ ఉన్నారు.
గోవిందరావుపేట/మంగపేట: గోవిందరావుపేట మండలం మచ్చాపూర్–చల్వాయి గ్రామాల మద్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురానికి చెందిన నానవరకు సందీప్(34) మృతి చెందగా అతడి కుమారుడు లలిత్‌సాయి, తల్లి రాణి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని కమలాపురం ఆటోస్టాండ్ సెంటర్‌లో సందీప్ హోటల్ నడుపుకుంటు జీవనం సాగిస్తున్నాడు. మృతుడు తల్లి రాణి, కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వరంగల్ నుంచి కమలాపురానికి వస్తున్నారు. మార్గ మధ్యలోని మచ్చాపూర్–చల్వాయి గ్రామాల మధ్య ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొనడంతో సందీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడి సృహతప్పి పడిఉన్న రాణితో గాయపడిన కుమారుడు లలిత్‌సాయిని స్థానికుల సాయంతో 108లో ములుగు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సృహతప్పి పడిఉన్న రాణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. పస్రా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.
లారీలు సమకూర్చి ధాన్యం తరలిస్తాం..
మహాముత్తారం: మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతతో ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉందని ఎస్సై మహేందర్‌కుమార్ తెలిపారు. గురువారం పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యాన్ని రెండు రోజుల్లో మిల్లులకు తరలించే ఏర్పాటు చేస్తామని లారీలకొరతతోఽ అధికారులు ధాన్యాన్ని తలించలేకపోయారన్నారు. అన్ని కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని మొత్తం తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని రైతులు ఆధైర్య పడవద్దని తెలిపారు.
సబ్సిడీపై జీలుగ విత్తనాలు
మొగుళ్లపల్లి: మండలంలోని రైతులకు 50 శాతం సబ్సిడీపై జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని మండల వ్యవసాయ అధికారి సురేందర్‌రెడ్డి తెలిపారు. మండలానికి మొత్తం 834 బస్తాలు కేటాయించగా, 30 కిలోల బస్తా రైతులకు రూ.2,452.50కు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ విత్తనాలను వినియోగించడం వల్ల నేల సారవంతం పెరిగి పంట దిగుబడులు మెరుగుపడతాయని తెలిపారు.
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
మొగుళ్లపల్లి: మండలంలోని కొర్కిశాల గ్రామ చెరువు వద్ద ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు దానవేణి రాములు, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


