ఏటూరునాగారం: పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా పాఠశాలలకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించి ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యాబోధన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటుంది. అందులో భాగంగానే ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభానికి ముందే జిల్లాకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్, ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలల్లో 26,858 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. దీంతో పాటు ముందుగా జూన్ మొదటి వారంలో బడిబాట కార్యక్రమాలను చేపడుతూ విద్యార్థుల ఆడ్మిషన్లను మరింత పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ఉపాద్యాయులు సైతం ఇంటిబాట పట్టి చేర్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటి వరకే విద్యావారోత్సవాల్లో భాగంగా బడిబాట కార్యక్రమం చేపట్టి కొంత మంది విద్యార్థులను ఎన్‌రోల్‌మెంట్ చేశారు.
డ్రాపౌట్స్‌పై దృష్టి
విద్యార్థుల ఆడ్మిషన్లు చేర్చి బడిబయట ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఇందు కోసం పక్కా ప్రణాళికను రూపొందించి జూన్‌లో మొదలయ్యే బడిబాట కార్యక్రమాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా చేపట్టేలా చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల హాజరు శాతం, భోజన సౌకర్యాలు, అల్పాహారం వంటి విషయాలను జోరుగా ప్రచారం చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు.
10 మండలాలు.. 475 పాఠశాలలు
జిల్లాలోని 10 మండలాల్లో 475 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఉచిత పాఠ్యపుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 26,858 మందికి అందించనున్నారు. ఇందుకు గాను 1,60,530 లక్షల పుస్తకాలు అవసరం ఉండగా ఇప్పటి వరకు 1,37,030 లక్షల పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 23,500ల పుస్తకాలు రావాల్సి ఉంది.
జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలు
475 పాఠశాలలకు 1,37,030
బుక్స్ రాక
దశలవారీగా పంపిణీకి సిద్ధం


