బాల్య వివాహాలు అరికడితేనే భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలు అరికడితేనే భవిష్యత్‌

May 28 2026 12:40 AM | Updated on May 28 2026 12:40 AM

ములుగు: బాల్య వివాహాలను అరికడితేనే బాలికల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని, అలాగే బాల్య వివాహ రహిత జిల్లాగా ములుగును తీర్చిదిద్దాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు పిలుపునిచ్చారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘బాల్య వివాహం – బతుకు ఆగం’ నినాదంతో బాల్య వివాహాల నిర్మూలనపై బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. చదువు, ఆరోగ్యం, స్వేచ్ఛను కాపాడాలంటే బాల్య వివాహాలకు పూర్తిగా చెక్‌ పెట్టాలన్నారు. బాల్య వివాహాలు ఒక సామాజిక దురాచారమని పేర్కొన్నారు. బాల్య వివాహాలతో బాలికలు విద్య, ఆరోగ్యం, హక్కులు, స్వేచ్ఛను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. బాల్య వివాహాల సమాచారం ముందుగా తెలిసే అవకాశం పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు, టెంట్‌ హౌస్‌ నిర్వాహకులు, ఫొటోగ్రాఫర్లకు ఎక్కువగా ఉంటుందని వివరించారు. వారు సామాజిక బాధ్యతతో ముందుకొచ్చి బాల్య వివాహాలను అడ్డుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌, సీడీపీఓ శిరీష, జిల్లా మిషన్‌ కోఆర్డినేటర్‌ రమాదేవి, సఖి కేంద్రం సెంటర్‌ అడ్మిన్‌ లావణ్య, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాల నియంత్రణపై చర్యలు

మాదక ద్రవ్యాల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో నార్కోటిక్‌ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు భద్రత ఆంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆదనపు కలెక్టర్‌ మహేందర్‌జీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. పాఠశాలలు, వసతి గృహాల పరిసరాల్లో మాదక ద్రవ్యాల విక్రయాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఆర్డీఓ ప్రతాప్‌, వరంగల్‌ నార్కొటిక్‌ ఈగల్‌ విభాగం డీఎస్పీ రమేశ్‌ కుమార్‌, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ఐటీడీఏ డీడీ జనార్దన్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement
 
Advertisement
Advertisement