లారీలు రాక.. రైతుల పరేషాన్‌ | - | Sakshi
Sakshi News home page

లారీలు రాక.. రైతుల పరేషాన్‌

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

రైతులను వెంటాడుతున్న భయం రైతులకు పోలీసుల సహకారం

గోవిందరావుపేట: జిల్లాలోని యాసంగి ధాన్యం కొనుగోళ్లు, బస్తాలు మిల్లులకు తరలించడంలో ఆలస్యం జరుగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చిన రైతులు పలుచోట్ల లారీలు కొరతతో పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తోడు కేంద్రాల్లో మౌలిక వసతులు లేకపోవడంతో ఎండ తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయే మబ్బులతో పరేషాన్‌ అవుతూ భయంభయంగా గడుపుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని 10 మండలాల పరిధిలో 98వేల ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేశారు. అధికారులు మొత్తం 1,08,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకు 60,000 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేసినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ధాన్యం తరలింపులో తీవ్ర సమస్యలు తలెత్తడంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం 150 లారీల ద్వారా ధాన్యం తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. లారీల కొరతతో ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించడం ఆలస్యమవుతుంది. కష్టపడి పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాత్రింభవళ్లు కేంద్రాల వద్దే కాపాలా ఉంటున్నారు.

గతేడాది ఇదే సమయంలో జిల్లాలోని పలు మండలాల్లో మూడు సార్లు అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన పంట కళ్లముందే నీటి పాలవడంతో అనేక కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయాయి. ఆ కష్టాల నుంచి పూర్తిగా కోలుకోకముందే రైతులు ఈ సారి మళ్లీ అప్పులు చేసి పంట సాగు చేశారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిలిచిపోవడంతో రైతుల్లో మళ్లీ భయం మొదలైంది. మే చివరి వారంలో ఎప్పుడైనా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. వచ్చిపోయే మబ్బులను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన జిల్లా పోలీసులు లారీల యజమానులతో మాట్లాడి తీసుకొచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పలు కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ రైతులతో మాట్లాడుతున్నారు. ధాన్యం సురక్షితంగా తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. లారీల యజమానులు, హమాలీతో కూడా పోలీసులు సమావేశాలు నిర్వహించి రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచిస్తున్నారు. రైతుల ధాన్యం వర్షానికి తడవకుండా త్వరగా తరలించేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేసి మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు.

గోవిందరావుపేటలో ధాన్యం బస్తాలను కాంటా వేసి కుట్టు వేస్తున్న హమాలీలు

బస్తాలు నింపి కాంటా వేస్తున్న హమాలీలు

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో

అన్నదాతల అవస్థలు

కాంటాలు అయి వారం దాటినా

మిల్లులకు కదలని బస్తాలు

అధికారులు తగిన చర్యలు

తీసుకోవాలని వేడుకోలు

Advertisement
 
Advertisement
Advertisement