దేవాదుల ఎత్తిపోతల వద్ద సిల్ట్‌ తొలగింపు | - | Sakshi
Sakshi News home page

దేవాదుల ఎత్తిపోతల వద్ద సిల్ట్‌ తొలగింపు

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం గ్రామ పంచాయతీలోని గుట్టలగంగారం సమీపంలో గల గోదావరిపై ఉన్న దేవా దుల ఎత్తిపోతల వద్ద సిల్ట్‌ తొలగించే పనులు అధికారులు మంగళవారం మొదలుపెట్టారు. ప్రతీ సంవత్సరం మే నెల చివరి వారంలో ప్రారంభించి పోర్‌బే గదులతో పాటు, కాల్వలో ఉన్న సిల్ట్‌ను తొలగించి శుభ్రం చేస్తారు. దీంతో నీరు కాల్వ ద్వారా పోర్‌బే నుంచి నీరు మోటర్ల వద్దకు చేరుతుంది. ఇలా చేరడంతో పంపింగ్‌ చేయడానికి సులువుగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ఎస్‌ఎఫ్‌ఐ శిక్షణ తరగతులు

ఏటూరునాగారం: జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు గోవిందరావుపేట పీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్‌ తెలిపారు. ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో శిక్షణ తరగతుల పోస్టర్‌ను ఆయన మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల్లో పోరాట పటిమ, హక్కులు, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాలను చేపట్టామన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాగటి రవితేజ, రవి, సిద్ధూ, సాత్విక్‌, రవి, రాజు పాల్గొన్నారు.

జేసీబీని అడ్డుకున్న ఉపాధి కూలీలు

భూపాలపల్లి రూరల్‌: మండలంలోని వజినపల్లి గ్రామంలో అక్రమంగా మట్టిని తరలించేందుకు వచ్చిన జేసీబీని ఉపాధి హామీ కూలీలు అడ్డుకున్నారు. గ్రామంలోని స్థానిక చెరువులో కొంతకాలంగా జేసీబీతో గుంతలు తవ్వుతూ మట్టిని తరలిస్తున్నారు. ఉపాధి కూలీలు ఏకమై మంగళవారం జేసీబీ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా జేసీబీ యజమాని కూలీలతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయమై కూలీ లు అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి మట్టి తీయడానికి అనుమతులు లేవని తెలపడంతో జేసీబీ వెనుదిరిగిపోయినట్లు కూలీలు తెలిపారు.

భూముల పరిరక్షణకు

ఉద్యమిస్తాం

ఏటూరునాగారం: గోదావరి పరిసరాల్లోని భూముల పరిరక్షణకు ఉద్యమిస్తామని, శాశ్వత పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కాకుమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల కేంద్రంలోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏటూరునాగారం మండలంలోని ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే వ్యవసాయ భూములు గోదావరిలో కలిసిపోతున్నాయన్నారు. ప్రతీ వర్షాకాలంలో వచ్చే వరదలతో వేలాది మంది రైతుల వ్యవసాయ భూములు నీటిలో కలిసిపోతుండడం బాధాకరమన్నారు. ఆ భూముల పరిరక్షణకు ముళ్లకట్ట నుంచి రామన్నగూడెం వరకు కాంక్రీట్‌ వాల్‌ నిర్మించాలన్నారు. లేదంటే వచ్చే నెలలో పాదయాత్ర చేపడుతామని హెచ్చరించారు. భూముల రక్షణకు కాంక్రీట్‌ వాల్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే మంత్రి సీతక్కను కలిసి సమస్యను వివరించుతామన్నారు. అనంతరం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. లారీలు సకాలంలో అందుబాటులో లేక రైతులు అదనపు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడించారు. లారీల యజమానులు రూ. 4, 5వేల వరకు అదనంగా డిమాండ్‌ చేస్తున్నారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement