వెంకటాపురం(కె): రోజు రోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా మండల కేంద్రంలో వారాంతపు సంత వెలవెలపోయింది. ఈ మేరకు మంగళవారం మండలకేంద్రంలో ప్రతీ వారం సంత నిర్వహణకు అధిక సంఖ్యలో జనం నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వచ్చేవారు. నేటి వారాంతపు సంతకు వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు లేక వ్యాపారాలు జరగలేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. మండలకేంద్రంలో 46 డిగ్రీల ఎండ నమోదు కావడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
కన్నాయిగూడెం: మండల కేంద్రంలోని రైతు వేదికలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు పలు గ్రామాల సర్పంచ్‌ల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, సర్పంచ్‌లు సర్పంచ్‌లు జాడి రాంబాబు, పీరీల స్వప్న, అనిత, అబాల సౌజన్య, రెవెన్యూ అధికారులు జీపీఓ కాసీం, రవి పాల్గొన్నారు
ములుగు రూరల్: బీజేపీ సినియర్ నాయకుడు అన్నపురెడ్డి ప్రమోద్‌రెడ్డి వడదెబ్బతో మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాన్ని పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, వర్ధన్నపేట మాజీ శాసనసభ్యుడు కొడేటి శ్రీదర్ బుధవారం పరామర్శించారు. ప్రమోద్‌రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర నాయకులు జాటోత్ మదీన్‌నాయక్, పుల్లారావు, భాస్కర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి ఉన్నారు.
రేగొండ: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమాని జైపాల్‌రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


