మహిళలను వేధిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

ములుగు: మహిళలను వేధిస్తే చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని, పని ప్రదేశాల్లో మహిళలకు పోష్‌ చట్టం ఒక రక్షణ కవచంలా ఉంటుందని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలలో భాగంగా ‘మహిళల భద్రత – రక్షణ’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలు గౌరవంగా, భయభ్రాంతులు లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలన్నారు. పోష్‌ చట్టం మహిళా ఉద్యోగులకు రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు. ప్రతీ కార్యాలయంలో 10 మందికి పైగా ఉద్యోగులు ఉంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వేధింపులకు గురైన మహిళలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. పోష్‌ చట్టంపై ప్రతీ ఉద్యోగికి అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు ఆదేశించారు. అనంతరం పోష్‌ చట్టం, న్యూట్రిషన్‌ పోస్టర్లను కలెక్టర్‌ అదనపు కలెక్టర్లు మహేందర్‌ జీ, సంపత్‌ రావుతో కలిసి ఆవిష్కరించారు. అంతకముందు దత్తత సహాయక కేంద్రాన్ని, మహిళా భద్రతపై సంతకాల సేకరణను ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఐదుగురికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. వారికి జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్లుగా వెంకటలక్ష్మి, భాను, హరీశ్‌, సునీత, వంశీకృష్ణలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను

ఘనంగా నిర్వహించాలి

రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు ఆదేశించారు. కలెక్టరేట్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేడుకలు జరిగే ప్రాంగణంలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌, టెంట్‌, కుర్చీల ఏర్పాట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌, భద్రత తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు పటిష్టంగా చేపట్టాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని, ఇతర శాఖల అధికారులు సైతం లోటుపాట్లకు తావు లేకుండా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ప్రేమలత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చంద్రకళ, ఆర్డీఓ వెంకటేశ్‌, డీఎస్పీ కిశోర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement