మహిళల ఆర్థిక సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

మహిళల ఆర్థిక సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధి

May 26 2026 7:48 AM | Updated on May 26 2026 7:48 AM

వర్చువల్‌ పద్ధతిలో మహిళా భవన

నిర్మాణాలకు సీఎం రేవంత్‌రెడ్డి

శంకుస్థాపన

ములుగు: మహిళల ఆర్థిక సాధికారతతోనే రాష్ట్రాభివృద్ధికి బలమైన పునాది అని సీఎం రేవంత్‌రెడి అన్నారు. సోమవారం తెలంగాణ సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 8వేల మహిళ భవనాల నిర్మాణానికి వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేసి భవనాల నిర్మాణ పనులను ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుంచి స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులతో కలెక్టర్‌ హేమంత్‌ సహదేవరావు వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఒకేసారి 8 వేల మహిళా సంఘ భవనాలకు శంకుస్థాపన చేయడం సంచలనాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఇప్పటి వరకు ఇందుకోసం రూ.10 వేల కోట్లకు పైగా ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా 1,000 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెట్రోల్‌ బంకుల నిర్వహణను కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకే అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మారుమూల గ్రామాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు ఈ ఏడాది సారెగా ఇందిరమ్మ చీరలను అందిస్తోందని వెల్లడించారు. గతంలో పంపిణీ చేసిన చీరల నాణ్యతపై విమర్శలు వచ్చినప్పటికీ, ప్రస్తుతం అందిస్తున్న ఇందిరమ్మ చీరలు ఎంతో నాణ్యతతో ఉన్నాయని తెలిపారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తామని తెలిపారు. వర్చువల్‌ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఆదనపు కలెక్టర్‌ సంపత్‌రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ, డీఆర్‌డీఓ చంద్రశేఖర్‌, డీడబ్ల్యూఓ ప్రేమలత, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement