కరకట్ట పటిష్టం | - | Sakshi
Sakshi News home page

కరకట్ట పటిష్టం

May 2 2026 11:25 AM | Updated on May 2 2026 11:25 AM

డీపీఆర్‌ ఇవ్వని అధికారులు.. ముంపు ప్రాంతాలు

రక్షణ కోసం జియోట్యూబ్‌ల ఏర్పాటు

శాశ్వత పరిష్కారం చూపాలి..

ఏటూరునాగారం: గోదావరి వరదకు కరకట్ట మట్టి ఒర్లిపోతుంది. పలుమార్లు దానికి రివిట్‌మెంట్‌, మట్టితో కోతలను నింపారు. కాని ప్రతీ వర్షాకాలంలో వరద తాకిడికి మట్టి తీవ్రంగా నీటి ప్రవాహంలో కలిసిపోతుంది. దానివల్ల కరకట్ట ఎప్పుడు తెగిపోతుందోనని గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి వరదల నుంచి కరకట్ట రక్షణకు చేపట్టిన జియోట్యూబ్‌ ఏర్పాటు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో రూ. 70 లక్షల బడ్జెట్‌ వ్యయంతో పనులు చేపట్టారు. ప్రస్తుతం 8 జియోట్యూబ్‌లలో ఇసుక నింపే పనులు చేస్తూ మట్టి ఒర్లిపోకుండా అడ్డుకట్టగా పెట్టారు. మొత్తం 50 వరకు ట్యూబ్‌లను 250 మీటర్ల మేర అమర్చనున్నారు. ఏటా వరదల సమయంలో గోదావరి ఒడ్డు కోతకు గురవుతుండడంతో కరకట్ట పటిష్టతకు చర్యలు చేపడుతున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో అమర్చారు. ప్రస్తుతం అదే పద్ధతిని ఇక్కడ అవలంభిస్తున్నారు.

ఏటూరునాగారం, మంగపేట, మండలాల్లో సుమా రు రూ.137 కోట్ల కరకట్ట, కాంక్రీట్‌ వాల్స్‌, గోదావరిలో నీటి కట్టలను నిర్మించడానికి 2022–23లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నిధుల కేటాయింపు మరుగున పడింది. కరకట్ట ఎక్కడ బలహీనంగా ఉంది.. ఎక్కడ కాంక్రీట్‌ వాల్‌ అవసరం, ఎక్కడ నీటిలో అడ్డుకట్టలు వేయాలనేది నేషనల్‌ అథారిటీ ఇరిగేషన్‌ వారు డిటేల్డ్‌ ప్రాజెక్డు రిపోర్టును ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు డీపీఆర్‌ ఇవ్వకపోవడంతో ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. కరకట్టకు ఉన్న గేట్లను సైతం పూర్తి స్థాయిలో మార్చి వేయాల్సి ఉంది. గతేడాదిలో ఇరిగేషన్‌ అధికారులు మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకున్నారు.

మంగపేట మండలం పరిధిలోని గంపోనిగూడెం, కమలాపురం, ఏటూరునాగారం మండల కేంద్రంతో పాటు రామన్నగూడెం, రాంనగర్‌ గ్రామాలకు గోదావరి వరదతో ముంపు వాటిల్లింది. కానీ కరకట్టలు ఉండడం వల్ల గ్రామాలకు పెద్ద నష్టం జరగలేదు. మట్టి కట్టల కోతల వల్ల స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులు నాలుగేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ముంపు నివారణ చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

రూ. 70 లక్షల నిధుల కేటాయింపు

ముమ్మరంగా సాగుతున్న పనులు

గోదావరి వరద ముంప్పు నివారణకు నిర్మించిన కరకట్ట కోతలకు గురికాకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం చూపాలి. కరకట్ట కోతకు గురై రివిట్‌మెంట్‌ కూలిపోవడం, ఒర్లిపోవడంతో కరకట్ట తెగే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలి.

– దొడ్డ కృష్ణ, రామన్నగూడెం

Advertisement
 
Advertisement
Advertisement