రామప్పలో కొనసాగిన శివరాత్రి ఉత్సవాలు
వెంకటాపురం(ఎం): మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా రామప్ప దేవాలయం శివనామస్మరణతో మార్మోగింది. ఆదివారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణానికి హాజరైన మంత్రి ధనసరి సీతక్క రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి రామలింగేశ్వరున్ని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ఆలయంలో గణపతి పూజ, రుద్రాభిషేకం, విగ్రహారాధన, వీరభద్ర పళ్లెరము, భద్రకాళి పూజ, సహస్రనామార్చన, బలిహారణ పూజలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన ఆర్చకుడు కోమళ్లపల్లి హరీశ్‌శర్మ, ఉమాశంకర్ తెలిపారు.
తగ్గిన భక్తుల రద్దీ
ఆదివారం అర్ధరాత్రి వరకు కిక్కిరిసిపోయిన రామప్ప దేవాలయం సోమవారం భక్తులు లేక వెలవెలబోయింది. ఆదివారం శివపార్వతుల కల్యాణం ముగియడంతోపాటు మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం ఉండడంతో సోమవారం రామప్ప ఆలయానికి రావడానికి భక్తులు ఆసక్తి చూపలేదు.
నేడు అగ్నిగుండాల మహోత్సవం
మంగళవారం తెల్లవారుజామున 4గంటలకు అగ్నిగుండాల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నట్లు రామప్ప ఆలయ చైర్మన్ మిల్కూరి అయిలయ్య, ఆలయ ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవ కార్యక్రమానికి సోమవారం రాత్రి 8గంటల నుంచి భక్తులు రామప్ప ఆలయానికి వస్తారని వారు తెలిపారు. అగ్నిగుండాల మహోత్సవం సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వెంకటాపురం ఎస్సై చల్ల రాజు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
839 మందికి వైద్య సేవలు
మహాశివరాత్రి సందర్భంగా రామప్పలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్యశిబిరం ద్వారా 839 మందికి వైద్యసేవలు అందించినట్లు వెంకటాపురం పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం 456 మందికి, సోమవారం 383 మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. భక్తులకు అందు బాటులో ఉండి సేవ చేయడం ఆనందంగా ఉందని వైద్యసిబ్బంది తెలిపారు.
రామప్పలో కొనసాగిన శివరాత్రి ఉత్సవాలు


