హస్తందే హవా..
జిల్లాలో పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు
జీపీ ఎన్నికల్లో బోల్తాపడిన బీఆర్‌ఎస్
ములుగు: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ ప్ర భుత్వం రెండేళ్ల పాలనలో పథకాల అమలును ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన పంచాయతీ అభ్యర్థులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీఆర్‌ఎస్ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభు త్వ తీరును విమర్శిస్తూ ప్రజల్లో ప్రచారాన్ని నిర్వహించారు.
మూడు మండలాల్లో..
ఈ సందర్భంగా తొలి విడత జీపీ ఎన్నికలు గురువారం జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్‌ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో జరుగగా ఓటర్లు కాంగ్రెస్‌కు బ్రహ్మరథం పట్టారు. మూడు మండలాల పరిధిలో 48 పంచాయతీలకు 9 ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవమైన పంచాయతీల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. మిగిలిన 39 పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరగగా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులు గెలుచుకున్నారు.
అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కై వసం
జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. మూడు మండలాల పరిధిలో 48 పంచాయతీలకు 9 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 39 స్థానాలకు ఎన్నికలు జరగగా 27 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు, 11 స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులు, ఒక స్థానంలో ఇతరులు గెలుపొందారు. మంత్రి సీతక్క నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కై వసం కావడంతో కాంగ్రెస్ నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. రెండు, మూడో విడతల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
బోల్తాపడిన బీఆర్‌ఎస్
రెండేళ్ల కాంగ్రెస్ పాలనను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థించిన తొలి విడతలో కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలు పట్టం కట్టారు. అదే విధంగా బీఆర్‌ఎస్ సర్పంచ్‌లకు ప్రజల నుంచి చుక్కెదురైంది. మూడు మండలాల్లో 48 పంచాయతీలకు 10 స్థానాలను మాత్రమే బీఆర్‌ఎస్ కై వసం చేసుకోవడంతో ప్రజల్లో బీఆర్‌ఎస్ పార్టీపై వ్యతిరేకత కొనసాగుతుందనే విమర్శలున్నాయి.
మండలం కాంగ్రెస్ బీఆర్‌ఎస్ ఇతరులు
ఎస్‌ఎస్ తాడ్వాయి 13 05 0
ఏటూరునాగారం 08 03 1
గోవిందరావుపేట 15 03 0
మొత్తం 36 11 01
36 స్థానాల్లో కాంగ్రెస్..
11 స్థానాల్లో బీఆర్‌ఎస్ విజయం
జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు


