మీరేదంటే అదే!
గుడులు కట్టిస్తాం.. బడులు బాగు చేస్తాం
పరకాల మండలానికి చెందిన ఓ మేజర్ గ్రామ పంచాయతీ నుంచి సర్పంచ్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థి ఒకరు ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజల డిమాండ్ నెరవేర్చేందుకు అడిగిందే తడవుగా గుడి కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఇది తెలిసిన మరో అభ్యర్థి సైతం ఆ సామాజిక వర్గం ఓటర్ల వద్దకు వెళ్లి తన సంసిద్ధతను వ్యక్తం చేయడం వివాదాస్పదమైంది. ఇద్దరూ తేల్చుకునేలోపే రెండో విడత ప్రచారం ముగిసింది.
వరంగల్ జిల్లా దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ మండలాల్లో వివిధ గ్రామాల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు గుడులు, బడుల మరమ్మతులకు హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మూడో విడత ప్రచారానికి రేపు తెరపడనుండగా.. నర్సంపేట, చెన్నారావుపేట, ఖానాపూర్ మండలాల్లో అభ్యర్థుల హామీల పరంపరతో ప్రచారం కొనసాగుతోంది.
సాక్షిప్రతినిధి, వరంగల్:
ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో రోజులు గడిచినా కొద్ది గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం పీక్‌కు చేరుతోంది. ‘మీరేం అడిగితే అది చేస్తాం. అభివృద్ధికి పాటుపడతాం. గుడులు కడతాం, బడులు బాగు చేస్తాం’ అంటూ అలవి కాని హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు సర్పంచ్ అభ్యర్థులు. రెండో విడత ప్రచారానికి శుక్రవారం తెరపడగా.. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 15న (సోమవారం) సాయంత్రం 5 గంటలకు మూడో విడత ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రచారం కొత్తపుంతలు తొక్కుతోంది.
వ్యూహాలతో ముందుకు వెళ్తూ..
మొదటి విడతలో 555 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 53 ఏకగ్రీవమయ్యాయి. 502 చోట్ల ఈనెల 11న పోలింగ్ నిర్వహించారు. 333 జీపీలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోగా, బీఆర్‌ఎస్ 148, బీజేపీ 17, సీపీఐ 1, ఇతరులు 56 చోట్ల గెలుపొందారు. ఈ ఫలితాలపై పోస్టుమార్టం నిర్వహించిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు.. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాల కోసం వ్యూహాలు రూపొందిస్తున్నారు. కొంచెం ఎఫర్ట్ పెడితే మరిన్ని స్థానాలు పెరిగేవని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తుండగా, మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగుతామని బీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. బీజేపీ సైతం తమ మద్దతుదారులను గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామంటున్నారు. ఇదే సమయంలో మొదటి విడతలో తలెత్తిన లోపాలను గుర్తించిన ఆ మూడు పార్టీల అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 564 పంచాయతీలకు 57 ఏకగ్రీవం కాగా, 507 గ్రామాల్లో ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు జరిగే పోలింగ్ కోసం ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి శనివారం రాత్రే అధికారులు, సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు.
జోరుగా ప్రలోభాలు.. పంపకాలు
రెండో విడత అభ్యర్థుల గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు శనివారం రాత్రి నుంచే విచ్చలవిడిగా ధనప్రవాహానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు గ్రామ పంచాయతీలను బట్టి ఓటుకు రూ.500ల నుంచి రూ.2,500ల వరకు పంపిణీ చేశారన్న ప్రచారం ఉంది. ఒక ఇంట్లో నలుగురు ఓటర్లుంటే ఫుల్‌బాటిల్.. కిలో చికెన్ చొప్పున చాలా గ్రామాల్లో సరఫరా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ సాగిందనే ఆరోపణలూ ఉన్నాయి. ఎన్నికల సంఘం కళ్లుగప్పి విచ్చల విడిగా పోల్ చిట్టీలతో పాటు డబ్బుల్ని పంపిణీ చేసేలా ఏర్పాటు చేసుకున్న కొందరు నాయకులు చాలా గ్రామాల్లో రెండో విడత కోసం శనివారం రాత్రంతా కొనసాగించారు. ఇదిలా ఉండగా, రెండో విడత పోలింగ్ సందర్భంగా పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. ఎన్నికలను సజావుగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు దీన్ని అమలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ఆందోళనలు చేపట్టవద్దన్నారు. కాగా ఆదివారం పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని బ్రాందీషాపులు, బార్లను అబ్కారీశాఖ అధికారులు శనివారం సాయంత్రం మూసివేశారు.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థుల పాట్లు
డబ్బు, మద్యం కానుకల ఎర
గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు
రెండో విడతకు నేడు పోలింగ్.. 564లో 57 ఏకగ్రీవం
507 పంచాయతీలకు హోరాహోరీ
‘రెండో’ పోరులో గెలిచేదెవరో?
పోలింగ్ కేంద్రాలకు చేరిన సామగ్రి
భారీగా భద్రత ఏర్పాట్లు చేసిన పోలీసులు


