అడవులతోనే మానవాళి మనుగడ
సౌత్ రేంజ్ అధికారి అప్సర్‌నిస్సా
కన్నాయిగూడెం: అడవులతోనే మానవాళి మనగడ కొనసాగుతుందని, అడవికి నిప్పు పెడితే భవిష్యత్ తరాలకు ప్రమాదం ఏర్పడుతుందని ఏటూరునాగారం సౌత్ జోన్ రేంజ్ అధికారి అప్సర్ నిస్సా అన్నారు. మండల పరిధిలోని బుట్టాయిగూడెం, లక్ష్మీపురం, చింతగూడెం, ఏటూరు, దేవాదుల గ్రామాల్లో అప్సర్ నిస్సా బుధవారం తిరుగుతూ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. అడవులకు నిప్పు పెట్టడంతో అడవులు అంతరించిపోతాయని గుర్తు చేశారు. నేటి అడవులతోనే భవిష్యత్ తరాలకు మనుగడ ఉంటుందని వివరించారు. రానున్న వేసవిలో అడవికి పనుల నిమిత్తం వెళ్లిన రైతులు, కూలీలు అడవికి నిప్పు పెట్టవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బీట్ అధికారులు రవి కుమార్, శ్రీనివాస్, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.


