ప్రలోభాలు షురూ
ఓటర్లకు మద్యం..
రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు
ములుగు: జీపీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండంతో ప్రచారానికి తెర పడింది. రేపు(11వ తేదీ) జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్‌ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లోని 39 సర్పంచులకు, 287 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కంటే 44 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో అభ్యర్థులు మంగళవారం సాయంత్రం నుంచే ప్రచారాన్ని ముగించారు. వారం రోజుల పాటు పంచాయతీల్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించిన అభ్యర్థులు ప్రచారానికి చెక్ పెట్టి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు.
39 సర్పంచులు.. 287 వార్డులకు పోలింగ్
జిల్లాలోని గోవిందరావుపేట, ఎస్‌ఎస్ తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల పరిధిలో 48 గ్రామ పంచాయతీలకు, 420 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా 9 జీపీలు 128 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన 39 సర్పంచ్ స్థానాలకు, 287 వార్డు స్థానాలకు రేపు(11వ తేదీ) ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం 436 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయగా 68,299 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
మూడో విడత అభ్యర్థులకు గుర్తులు
వెంకటాపురం(కె), వాజేడు, కన్నాయిగూడెం మండలాల పరిధిలోని పంచాయతీలకు మంగళవారం ఉప సంహరణ గడువు ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
మూడు మండలాల పరిధిలో 46 సర్పంచ్ స్థానాలు ఉండగా ముప్పనపల్లి పంచాయతీ ఏకగ్రీవం అయింది. మిగిలిన 45 పంచాయతీలకు 209 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 408 వార్డు స్థానాలకు 48 ఏకగ్రీవం కాగా మిగిలిన 360 వార్డు స్థానాలకు 926 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో వారు ప్రచారాన్ని మొదలు పెట్టారు.
122 మంది ఆర్వో, ఏఆర్వోలకు విధుల కేటాయింపు
జిల్లాలో మూడు విడతల్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు రిటర్నింగ్ ఆఫీసర్లు(ఆర్వో), అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల(ఏఆర్వో)కు విధులు కేటాయించారు. మొదటి విడత ఎన్నికలకు 20 మంది ఆర్వోలు, 20 మంది ఏఆర్వోలు, రెండో విడతకు 23 మంది ఆర్వోలు, 23 మంది ఏఆర్వోలు, మూడో విడతకు 18 మంది ఆర్వోలు, 18 మంది ఏఆర్వోలను కేటాయించారు. మూడు విడతల్లో 9 మండలాల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో 122 మంది ఎన్నికల అధికారులుగా విధులు నిర్వర్తించనున్నారు.
మొదటి విడత పోలింగ్‌కు 44 గంటల ముందు నుంచే ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుంది. పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచారాలు నిర్వహించవద్దు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామ పంచాయతీల్లో ఉండకూడదు. ఎన్నికల ఉల్లంఘనలు పాల్పడితే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని విబాగాల నోడల్ అధికారులకు ఆదేశించాం.
– టీఎస్ దివాకర, కలెక్టర్
గ్రామాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు మందు పార్టీలను ఏర్పాటు చేస్తున్నారు. ఎలాగైన సర్పంచ్, వార్డు సభ్యుడిగా గెలుపొందాలని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. ఆయా గ్రామాలను బట్టి ఓటుకు రూ.300ల నుంచి రూ. 500ల వరకు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. అలాగే మద్యం షాపులు బంద్ ఉండడంతో అభ్యర్థుల అనుచరులు మద్యం సమకూర్చుకునే పనిలో పడ్డారు.
39 సర్పంచ్ స్థానాలకు
బరిలో 145 మంది అభ్యర్థులు
287 వార్డు స్థానాలకు 753 మంది
మూడో విడత పోలింగ్ అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు
ప్రలోభాలు షురూ


