విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
చిట్యాల: పాఠశాలలో విద్యార్థులకు విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలని జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పింగిలి విజయపాల్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మండలంలోని జూకల్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల తరగతులను పరిశీలించారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో అమలు అవుతున్న విద్యా కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. పదో తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు ప్రణాళికతో చదువుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా పథకాలను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లి విద్యార్థుల నమోదును పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ, ఉపాధ్యాయులు ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా ఎన్నికలను జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఓటింగ్ పద్ధతి ద్వారా నిర్వహించిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షుడిగా స్థానిక అయ్యప్ప టెంపుల్ ప్రధాన పూజా రి కుదురుపాక కృష్ణమాచార్యులు, ప్రధాన కార్యదర్శిగా బలబత్తుల రాజేశ్వరచార్యులు, కోశాధికారిగా తంగేళ్లపల్లి వెంకటాచార్యులు ఎన్నికయ్యారు. వారితో కమిటీ సభ్యులు, పూర్తి స్థాయి కమిటీని ఎన్నుకున్నారు.
● ట్రాక్టర్‌కింద పడి బాలుడి మృతి.. తల్లిదండ్రులకు అప్పగించకుండా పూడ్చివేత
గణపురం: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కింద పడి ఓ బాలుడు చనిపోయాడు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ గుట్టుచప్పుడు కాకుండా ఆ బాలుడి మృతదేహాన్ని ఓపెన్‌కాస్ట్ మట్టి డంపింగ్‌యార్డులో పూడ్చిపెట్టాడు. ఈ విషయం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. గణపురం ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మరావుపేట గ్రామానికి చెందిన బందెల రాకేష్ (6) ఈ నెల8వ తేదీన ఇంటి వద్ద ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన గంపల శంకర్ ట్రాక్టర్‌లో వడ్లు తీసుకొని ఐకేపీ సెంటర్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ బాలుడిపైనుంచి వెళ్లింది. దీంతో బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. కాగా, తన కుమారుడు రాకేష్ కనిపించకపోవడంతో తండ్రి రాజు పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులకు శంకర్‌ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అతను బాలుడు రాకేష్ మృతదేహాన్ని గ్రామ శివారులో ఓసీ–3 డంపుయార్డుకి తీసుకువెళ్లి మట్టిలో పూడ్చివేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా, శంకర్‌ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మెట్‌పల్లి (కన్నెపల్లి) పంపుహౌస్ నుంచి గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వరకు ఉన్న పైప్‌లైన్ కాళేశ్వరంలోని జాతీయ రహదారి 353(సీ)పక్కనే ఉన్నటువంటి గేట్‌వాల్వ్ వద్ద లీకేజీ ఏర్పడింది. లీకేజీ అయి నెలలు గడుస్తున్నా సంబంధిత కేటీపీపీ ఇంజనీర్లు మొద్దునిద్ర వీడడం లేదు. దీంతో గోదావరి నీరు వృథాగా పోతోంది. దీంతో రోడ్డు పక్కనే పెద్ద నీటిగుంటగా ఏర్పడి నీరు నిల్వగా మారింది. దీంతో చెత్తాచెదారం చేరి దోమలు వృద్ధి చెంది స్వైరవిహారం చేస్తున్నాయి. పందులు మురికి నీటిలో సేదదీరుతున్నాయి. చుట్టుపక్కల ఇళ్లకు దుర్వాసన వెలజల్లుతోంది. రోగాలు ప్రబలుతున్నాయి. సంబంధిత ఇంజనీర్లు, ఉద్యోగులు అటువైపు చూడడం లేదని ప్రజలు వాపోతున్నారు.
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి


